ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : కార్పొరేషన్ పరిధి పెదవడ్లపూడి మూడవ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ గుమ్మడి చంద్రశేఖర్ (37) విధినిర్వహణలో గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. ఆయనకు భార్య, కుమార్తె కలరు. ప్రతి రోజు మాదిరి సోమవారం ఉదయం 10 గంటలకు విధి నిర్వహణ నిమిత్తం సచివాలయానికి హాజరయ్యారు. ఈనెల 26వ తేదీన తుళ్లూరు మండలం వెంకటపాలెంలో జరిగే ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులను ఆహ్వానించాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి సచివాలయం నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లేందుకు బయలుదేరారు. ఇంతలో ఒక్క సారిగా గుండెపోటుకు గురై రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ లో చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు.
- స్వగ్రామానికి భౌతిక కాయం తరలింపు.
కాగా గుండెపోటుకు గురై మృతి చెందిన వెల్ఫేర్ సెక్రెటరీ గుమ్మడి చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామమైన పెదకూరపాడు కు తరలించారు. కాగా ఎన్నారై వద్ద చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖ సిబ్బంది, మండల రెవెన్యూ అధికారులు సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.










