Feb 16,2023 23:44

రికార్డులు పరిశీలిస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి -భట్టిప్రోలు : మండల పరిధిలోని వెల్లటూరు గ్రామ సచివాలయాన్ని రేపల్లె ఆర్‌డిఒ పార్థసారథి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలు ,ప్రజల అవసరాలు,జగనన్న కాలనీ గహా నిర్మాణాలు, మౌలిక వసతులు వాకబు చేశారు.అనంతరం రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందింస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేవిధంగా చూడాలని కార్యదర్శి రాంకుమార్‌ ను ఆదేశించారు. అనంతరం ఎస్‌టి కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల హాజరు, పౌష్టికాహారం పంపిణీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎంఎల్‌ శ్రావణ్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి ఆర్‌ఐ శివరామకష్ణ, సర్పంచి చౌటురి లక్ష్మీ ,విఆర్‌ఒ వినీత తదితరులు పాల్గొన్నారు. పంగులూరు : వాలంటీర్లు తమ పనితీరును మెరుగు పరుచకోవాలని ఎంపిడిఒ ఎంవి. రమణమూర్తి తెలిపారు. మండల పరిధిలోని కోటపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, సిబ్బంది హాజరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ వాలంటీర్ల హాజరు సరిగా లేదని, పనితీరు మెరుగుపరచుకొని ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎప్పటికప్పుడు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. అనంతరం మండల ప్రాథమికొన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్నం భోజన పథకం రికార్డులు, శానిటరీ పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రసూతి మహిళలు, బాలింతలతో మాట్లాడారు. రికార్డులు, మెనూ పరిశీలించారు. చెత్త నుంచి సంపద కేంద్రాన్ని తనిఖీ చేసి తడి చెత్త, పొడి చెత్త, సేంద్రీయ ఎరువుల తయారీని పరిశీలించారు. అనంతరం సొంత స్థలాల్లో గహ నిర్మిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత గ్రామంలోని ఆడిటోరియంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న మందులు పంపిణీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.