Nov 16,2022 23:07

గాంధీజీకి వినతిపత్రం అందిస్తున్న ప్రజలు

మండల పరిషత్‌ వద్ద ముచ్చర్ల వాసుల ధర్నా
గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేత
ప్రజాశక్తి -ఆనందపురం:
రికార్డుల్లో ముచ్చర్ల పేరుతో ఉన్న సచివాలయాన్ని కణమాం తరలించే చర్యలను మానుకోవాలని, ముచ్చర్లలోనే సచివాలయ భవనం నిర్మించి, ఇక్కడే సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఆ గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.ముచ్చర్ల సచివాలయాన్ని కణమాం తరలించడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.అలాగే ఇఒపిఆర్‌డి ఆంజేయులకు వినతిపత్రాన్ని అందించారు. ప్రజాశక్తిలో ఈనెల 14న సచివాలయంఏర్పాటుపై వివాదం శీర్షికతో వచ్చిన కథనానికి గ్రామస్తుల్లో కదలిక వచ్చింది.
ఈ సందర్భంగా సర్పంచ్‌ షినగం ఎర్రయ్య, ఇతర గ్రామస్తులు మాట్లాడుతూ, మండలంలో 26 పంచాయతీలకు ఏర్పాటు చేసిన 18 సచివాలయాల్లో ముచ్చర్ల ఉందని, ఇపుడు భవన నిర్మాణాలను వచ్చేసరికి, ముచ్చర్ల పేరును మాయం చేసి, కణమాంలో కొనసాగించేలా చర్యలు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కణమాంలో కావాలంటే వేరే సచివాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని, ముచ్చర్ల పేరుతో ఉన్న సచివాలయాన్ని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.వీ విషయంలో రాజకీయాలు చేసి అన్యాయం చేస్తే, గ్రామస్తులంతా సంఘటితమై బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తక్షణమే ముచ్చర్లలో సచివాలయ సేవలు కొనసాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో మాజీ సర్పంచ్‌ లంక ఆప్పలనారాయణ, లంక రమణ, మాజీ ఎంపిటిసిలుపాండ్రంకి గంగరాజు, సినగం శివ, గుషిడి ముత్యాలు, జనసేన నాయకులు శినగం బంగారునాయుడు, యువకులు లెంక శివాజీ, గంగునాయుడు, పా డ్రంకి శివసత్యం పాల్గొన్నారు.