ప్రజాశక్తి-విజయవాడ: ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్‌అజరు సచివాలయ సిబ్బందినీ ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధి విజయవాడ పశ్చిమ మండలంలోని కుమ్మరిపాలెం, హెడ్ వాటర్ వర్క్స్, గుప్తా సెంటర్, పున్నమి ఘాట్ ప్రాంతాలలోని 194, 119, 159, 121 సచివాలయాలను గురువారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజరు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైస్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ విధానాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాల వివరాలతో కూడిన పోస్టర్స్ పరిశీలించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున సర్వీసులు, సిబ్బంది హాజరు పట్టీని పరిశీలించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సచివాలయాలకు వస్తారని వారిని సిబ్బంది మర్యాదపూర్వకంగా పలకరించి వీలైనంత మేరకు ఆయా సమస్యలను సంభందిత శాఖల ద్వారా పరిష్కరించాలని అన్నారు. స్థానిక సచివాలయాల పరిసరాలలో పారిశుధ్యం మెరుగుపరచడంతో పాటు చెత్త సేకరణలో ప్రజలకు అవగాహన కల్పించాలని జెసి అన్నారు.










