Aug 08,2022 23:06

సమావేశంలో మాట్లాడుతున్న చీఫ్‌ సిటీ ప్లానర్‌ సురేష్‌

ప్రజాశక్తి-కంచరపాలెం : వార్డుల వారీగా ప్రతి సమాచారమూ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలని జివిఎంసి చీఫ్‌ సిటీ ప్లానర్‌ బి.సురేష్‌ స్పష్టం చేశారు. జివిఎంసి 51వ వార్డు పరిధి మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం సచివాలయ టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారుల ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలు తదితర వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. నిర్మాణాల విషయంలో సచివాలయ సిబ్బంది కీలకంగా వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఇబ్బందులు తప్పవన్నారు. వార్డుల వారీగా సచివాలయం ప్లానింగ్‌ కార్యదర్శులు సేకరిస్తున్న డేటాను ప్రతి 15 రోజులకు ఒకసారి బుక్లెట్‌ చేసుకోవడం ద్వారా ప్రతి సమాచారమూ నిమిషాల వ్యవధిలో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. జివిఎంసి పరిధిలో చేపడుతున్న నిర్మాణాల ప్లాన్‌ అప్రూవల్‌కు 14 శాతం రుసుం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. జివిఎంసి జోన్‌ -5 కమిషనర్‌ ఆర్‌జివి.కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం స్మార్ట్‌ సిటీగా రూపాంతరం చెందిన విశాఖ అభివృద్ధికి సచివాలయ సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్కింగ్‌ సమస్య ఉందని, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలం గుర్తించి పార్కింగ్‌ ఏర్పాటు వల్ల ట్రాఫిక్‌ సమస్య తీరడంతో పాటు గా జివిఎంసికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. వార్డుల వారీగా మురికివాడలను గుర్తించి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోన్‌ 5 ఎసిపి అరుణవల్లి, డిప్యూటీ సిటీ ప్లానర్‌ నరేంద్ర, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.