Oct 28,2023 23:23

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వం అందిస్తున్న సేవలు గ్రామ, వార్డు స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా, ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అమలు చేస్తుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెబుతోంది. మొత్తం 18 విభాగాల్లో ఉద్యోగులను నియమించి సేవలు అందిస్తున్నారు. అన్ని విభాగాల్లో పలు ఖాళీ పోస్టులు మిగిలి ఉన్నాయి. వాటి భర్తీ కోసం నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తోంది. మరోవైపు పలు కీలక విభాగాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఆయా గ్రామ, వార్డు పరిధిలో ప్రజలకు సేవలు అరకొరగానే అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి అంతా వీటిపైనే ఆధారపడి మండల, జిల్లా కార్యాలయాలకు వెళ్లడం మానేశారు. అయితే కొన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రజలకు సేవలు అందించడంలో ఉన్న సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిపై ఒత్తిడి పెరుగుతుంది.
1800 పైనే ఖాళీ పోస్టులు
గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగిలి ఉన్న ఖాళీ పోస్టుల భర్తీకి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఖాళీలు ఒత్తికి ప్రభుత్వం మళ్లీ చొరవ చూపలేదు. 2019 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 319 వార్డు, 1271 గ్రామ సచివాలయాలు మొత్తంగా 1590 సచివాలయాల్లో 13,650 పోస్టులు మంజూరు చేసింది. మొదటి, రెండో విడతలో పోస్టులను భర్తీ చేసినా ప్రస్తుతం సుమారు 11,800 మంది పని చేస్తున్నారు. ఇందులో 18 విభాగాల్లో 1,236 ఖాళీలుండగా పలువురు వివిధ శాఖల్లో ఇతర ఉద్యోగాలకు, మరికొందరు వివిధ కారణాలతో సచివాలయ ఉద్యోగాలను వదిలి వెళ్లారు. ఇలా అనేక కారణాలతో మరో సుమారు 600 మంది వరకూ లాంగ్‌ లీవ్‌ లోకి వెళ్లారు. మొత్తంగా 1800 పైనే సచివాలయాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి.
నిరుద్యోగులు ఎదురుచూపులు
వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా ఒక్క సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు తప్ప ఇతర శాఖల్లో ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయలేదు. దీంతో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివిన వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న సచివాలయ ఖాళీ పోస్టులనైనా ప్రభుత్వం భర్తీ చేస్తే ఉపాధి లభిస్తుందని అంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.