
కలెక్టర్ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి వివరాలు అందరికీ తెలిసేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్టే బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారు లను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో మా నమ్మకం నువ్వే జగనన్న ప్రభుత్వ పథకాలు డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు, గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జిఇఆర్) అంశాలపై మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పూర్తి సమాచారం ప్రజలందరికీ తెలియాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివాలయ పరిధిలో ప్రభుత్వ పరంగా జరిగే సభలు, సమావేశాలు తేదీ, సమయం, ప్రదేశం, ప్రజా ప్రతినిధులు పేర్లు, కార్యక్రమం పూర్తి వివరాలను ప్రతి నెలలో మొదటి రోజున డిస్ ప్లే బోర్డులో పొందుపరచాలన్నారు.హొ
పిల్లలు బడిలోనే ఉండాలి
బడి ఈడు పిల్లలు బడి బయట ఉంటే సంబంధిత అధికారులు భాధ్యత వహించాలని కలెక్టర్ హెచ్చరించారు. గ్రాస్ ఎన్రోల్మెంటు రేషియో (జిఇఆర్) మండలాలు, మున్సిపల్ వారీగా సమీక్షించారు. విద్యాశాఖ సర్వే చేసిన సిఆర్ యాప్‌ను, సచివాలయ వాలంటీర్లు సర్వే చేసిన బిఒపి యాప్‌ను పరిశీలించాలన్నారు. జిల్లాలో ఐదు నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్నవారంతా బడిలోనే ఉండాలన్నారు. హొఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, డిఎల్‌డిఒ కెసిహెచ్.అప్పారావు, జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ, భీమవరం పురపాలక సంఘం కమిషనర్ ఎం.శ్యామల పాల్గొన్నారు.