
ప్రజాశక్తి-కె.కోటపాడు
మండలంలోని సింగన్నదొరపాలెం గ్రామ సచివాలయంలో మంగళవారం మొట్టమొదటిగా భూ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వెంటనే పత్రాలను అందజేశారు. జగనన్న రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్తగా ల్యాండ్ పార్సిల్ నెంబర్లను కేటాయించారు. పాత సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీ నెంబర్లను భూ యజమానులకు కేటాయించారు. రైతులకు అందిస్తున్న భూ హక్కు పత్రాల్లో కొత్తగా పాత సర్వే నెంబర్లతో పాటు ఎల్పీ నెంబర్లను కూడా ముద్రించి అందజేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్న భూములను అదే సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కె కోటపాడు మండలంలో రీ సర్వే పూర్తయిన తొమ్మిది గ్రామాల్లో ఎల్పీ నెంబర్లు కేటాయించారు. ఏడు గ్రామాల్లో రిజిస్ట్రేషన్లకు కావలసిన కెమెరా స్కానింగ్ పరికరాలను సచివాలయాలకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఐడి నెంబర్, పాస్వర్డ్‌లు కేటాయించలేదు. ప్రస్తుతం సింగన్న దొరపాలెంలో సబ్ రిజిస్ట్రార్ బంగారు వెంకటేశ్వరరావు తన సిబ్బందితో వెళ్లి రిజిస్ట్రేషన్ తంతును పూర్తి చేశారు. ఇకపై రిజిస్ట్రేషన్ సమయంలో ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నట్లయితే వెంటనే తనను సంప్రదించాలని సబ్ రిజిస్ట్రార్ సూచించారు.