
ప్రజాశక్తి - నంబులపూలకుంట : మండల కేంద్రంలోని 1,2 సచివాలయాలు ఎప్పుడు పనిచేస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఎప్పుడు చూసినా ఈ కార్యాలయాల తలుపులు మూసివేసి ఉంటాయని అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియని దుస్థితి నెలకొందని స్థానికులు విమర్శిస్తున్నరు. మండల కేంద్రంలో 1,2 సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలో ఒకే చోట ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది విధులకు హాజరవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలు సమయానికి తెరవకపోవడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని విమర్శిస్తున్నారు. చివరకు అధికారులు రాకపోతే ఊసురుమంటూ తిరిగి వెళ్లిపోతున్నారని అంటున్నారు. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో ఇక్కడి అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారైందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబందిత అధికారులు స్పందించి సచివాలయ, రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు సమయానికి విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.