Dec 14,2022 00:18

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం స్థానికులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-సీలేరు
సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థల వల్ల అనేక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి అన్నారు. జీకే.వీధి మండలం సీలేరులో వాటర్‌ ట్యాంకు, సచివాలయం, రైతు భరోసా కేంద్రాల భవనాలను ఆమె ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన జికె.వీధి మండలం సీలేరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ కె.పరదేవి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ సీలేరు సర్పంచ్‌ కె.పరదేశి పార్టీలకు అతీతంగా ప్రజలకు గణనీయమైన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. ఆయన అకాల మృతి తీవ్ర మనోవేదన గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు సంక్షేమ ఫలాలను వారి చెంతకు చేర్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ పిల్లా సాంబమూర్తి వైసీపీ అధ్యక్షులు కృష్ణమూర్తి సీలేరులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మధ్యాహ్నం సీలేరు పంచాయతీ పరిధి చింతపల్లి క్యాంపుకు చేరుకొని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీలేరు మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జీకే వీధి ఎంపీపీ బోయిని కుమారి, జడ్పిటిసి కిముడు శివరత్నం, ఎంపీటీసీ పిల్ల సాంబమూర్తి, వైసిపి అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఇఓపిఆర్‌డి పాపారావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ డీఈ రుక్మానందరావు, జెఇ భగవంతురావు, పంచాయతీరాజ్‌ ఏఈ కె.సత్తిబాబు, జెఇ జ్యోతి బాబు, జీకే వీధి సీఐ అశోక్‌ కుమార్‌, స్థానిక ఎస్సై రామకృష్ణ, సీలేరు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్‌ వల్లి ప్రసాద్‌, సర్పంచి కుంజేటి రామకృష్ణ, వైసిపి నాయకులు బొబ్బిలి లక్ష్మణ్‌, వెంకట్రావు, చంద్రయ్య, స్వర్ణలత, తిరుపతి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.