
గుర్ల : సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సామాన్య ప్రజలకు ధైర్యం, స్థైర్యం కల్పించారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుజ్జంగివలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, మనిషికి ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్ళి మొక్కుకోవడం అలవాటని, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం సచివాలయానికి వెళ్తున్నారని చెప్పారు. దీని ద్వారా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను సచివాలయ సిబ్బంది ద్వారా వివరించారు. సమగ్ర భూ సర్వే పథకం వరం లాంటిదని, ప్రభుత్వమే ఉచితంగా భూములను సర్వే చేయించి, హక్కులు కల్పిస్తోందని చెప్పారు. ఫ్యామిలీ ఫిజియన్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను మంత్రి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇస్తున్న టేక్ హోమ్ రేషన్లో ఒక లీటరు పాల పేకెట్లు బదులు అర లీటరు పేకెట్లు ఇవ్వాలని కలెక్టర్ కు సూచించారు. జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుజ్జంగివలస గ్రామమంటే ఎంతో అభిమానము ఉందని, ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 70 శాతం సవివాలయాలను పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ బి.శాంతకుమారి, జెడ్‌పిటిసి శీర అప్పలనాయుడు, ఎంపిపి పొట్నూరు ప్రమీల, డిఎల్‌డిఒ ఛైర్మన్ బెల్లాన బంగారునాయుడు, తహశీల్దార్ వి.పద్మావతి, ఎంపిడిఒ బి.కల్యాణి పాల్గొన్నారు.