ప్రజాశక్తి-పంగులూరు: సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని కోటపాడు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం కృష్ణ చైతన్య గ్రామంలో నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల రాకతో గ్రామాల్లో అభివృద్ధి మొదలైందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. సచివాలయ వ్యవస్థ వలన అనేకమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, పరిపాలన కూడా గ్రామంలోకి రావడంతో పాలన సులభం అయిందని, ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయని అన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన సలహాలు సూచనలతో పాటు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి మొదలైన వాటిని ప్రభుత్వం అందిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు పంటలను కొనుగోలు చేసే విధంగా ఆర్బికేలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లను అభివృద్ధి పరచాలని, ప్రజల ముంగిటకే వైద్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో జగన్మోహన్‌రెడ్డి ఉన్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలతో ప్రజలతో నిరంతరం మమేకమైన జగన్మోహన్‌రెడ్డిని, ప్రజలు ఆశీర్వదించాలని, మరోసారి ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేళ్ల నాగమ్మ, ఎంపీడీవో రమణమూర్తి, మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచి నారాయణ, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాయిని వెంకట సుబ్బారావు, వైసీపీ నాయకుడు మాజీ సర్పంచి ఎర్రం గోపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ రామ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.










