Aug 04,2023 23:44

ప్రజాశక్తి-కాజులూరు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం తదితర వ్యవస్థల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారని రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం శీల గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రి వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందుతున్నాయన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఇలా వివిధ శాఖలకు సంబంధించి పది మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఈ సచివాలయాల సిబ్బంది మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకులు (విఎఎ) ప్రతిదశలోనూ రైతులకు అండగా ఉంటున్నారన్నారు. గత వరదల సమయంలో పంట నష్టపోయిన సందర్భంలో వివరాలు సేకరించి, సత్వరం రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందడంలో వీరు కీలక పాత్ర పోషించారని వివరించారు. సమాజంలో పేదరికాన్ని తొలగించడానికి వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నేతత్వంలో అమలవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సుబ్బారావు, ఎంపిపి భారతి మురళి, ఎంపిడిఒ రత్నరాజ్‌, వ్యవసాయ అధికారి అశోక్‌, ఎంపిటిసి కృష్ణమూర్తి, సర్పంచ్‌ కోమలి వెంకటరమణ, గుబ్బల యేసు రాజు, పంచాయతీ కార్యదర్శి సూరిబాబు, పెద్దిరెడ్డి వెంకటరమణ పాల్గొన్నారు.