ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సచివాలయ వ్యవస్థతో మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామస్వరాజ్యం సాకారమైందని రాష్ట్ర హోంశాఖా మంత్రి తానేటి వనిత అన్నారు. మండలంలోని చినబొండపల్లిలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామసచివాలయ భవనాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రోడ్‌షో నిర్వహించి ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా, ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు, అవినీతికి చోటులేకుండా ప్రజలఖాతాల్లో నేరుగా వేసిన చరిత్ర సిఎం జగన్‌మోహనరెడ్డిదేనని అన్నారు. కుల, మత, వర్గ బేధాలు లేకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు రూ.2లక్షల కోట్లుకు పైగా అర్థిక సహాయం అందించారని, వైసిపి ప్రభుత్వా నికి ప్రజల్లో వస్తున్న ఆదరణచూసి ఓర్వలేక ప్రతిపక్షాలు జండా, ఎజండాలేకుండా విమర్శిస్తు న్నాయని అన్నారు. పేదల తలసరి ఆదాయం పెరగడమేకాకుండా, రాష్ట్ర జిడిపి గణనీయంగా పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాబోయే ఎన్నికల్లో తమ నాయకుడు మళ్లీ సిఎం కావడం ఖాయమని, ఇంతకు పదిరెట్లుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపే సత్తా జగన్‌కు ఉందని అన్నారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ తాము గెలిస్తే ప్రజలకు ఏమిచేస్తామో, రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ది చేస్తామో చెప్పకుండా రాష్ట్రంలోని కుహానా ప్రతిపక్షాలు అన్ని ఏకమై వైసిపి ప్రభుత్వం మళ్లీ అధికారంలో రాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గండి శంకరరావు, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్‌ఎంపిపిలు సిద్ధా జగన్నాధరావు, బంకురు రవికుమార్, ఆత్మ చైర్మన్ వై.తిరుపతి రావు, పెదబొండపల్లి పిఎసిఎస్ చైర్మన్ తీళ్ల శివున్నాయుడు, నాయకులు మజ్జిచంద్రశేఖర్, భీమవరపు కృష్ణమూర్తి, బొమ్మి రమేష్, మడక విశ్వనాధం, గ్రామస్తులు పాల్గొన్నారు.










