ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్,టౌన్ : జిల్లా కేంద్రంలోని కొత్త బెలగాం 16వ వార్డు 8వ సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి జి. శంకర్రావుపై అదేవార్డుకు చెందిన కొందరు బుధవారం దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దుతూ భౌతికదాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. 8వ సచివాలయానికి 16వ వార్డుకు చెందిన తొండ్రంగి సంతోష్‌కుమార్, జంపా జగన్నాధం, పాలకొల్లురాముతో పాటు మరికొందరు వ్యక్తులు మధ్యాహ్న భోజన సమయంలో వెళ్లారు. వెల్పేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గొండేల వెంకటరమణ (వికలాంగుడు)తో జగనన్న చేదోడు పథకంలో తాము అర్హులమైనప్పటికీ ఎందుకు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అతనిపై చేయి చేసుకుంటూ కులంపేరుతో దూషించారని బాధితుడు చెప్పాడు. భయంతో కేకలు వేయడంతో తన సహోద్యోగి రావడంతో బతికానని తెలిపాడు. ఈ సంఘటన మధ్యాహ్నం 2గంటలకు జరిగినప్పటికీ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు రాత్రి 7గంటల వరకు తీసుకోలేదు. దీంతో మిగతా సచివాలయ ఉద్యోగులంతా తమ విధులు ముగించుకుని పోలీసు స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేసారు. ఇంతలో ఎన్‌జిఒ సంఘం రాష్ట్ర కార్యదర్శి జివికిషోర్ కల్పించుకుని పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసి, బాధితుడు, ఉద్యోగులు కలసి డిఎస్‌పి కార్యాలానికి వెళ్లారు. సచివాలయ పరిధిలోని ఒక వార్డుకు చెందిన రాజకీయ నాయకుని ప్రమేయం ఉండడం వల్లే కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నట్లు సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈసంఘటనపై వెంటనే కేసు నమోదు చేసి బాధితునకు న్యాయం చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.










