ప్రజాశక్తి - దేవరాపల్లి
మండలంలోని వేచలం సబ్ స్టేషన్, సచివాలయం పరిధిలో ఎలక్ట్రికల్ ఎనర్జీ అసిస్టెంట్ (లైన్‌మెన్)గా విధులు నిర్వహిస్తున్న దేవరాపల్లి గ్రామానికి చెందిన గొర్లె వరుణ్ కుమార్ (31) శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... తండ్రి లేకపోవడంతో గొర్లె వరుణ్‌కుమార్ తను తల్లితో కలిసి దేవరాపల్లి బీరక వీధిలో మేనమామ ఇంట్లో నివాసముంటున్నారు. వరుణ్‌కుమార్ శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి రెండవ అంతస్తు గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని ఎంతకి రాలేదు. అనుమానం వచ్చి ఫోన్ చేయగా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి స్లాబ్ హుక్‌కి తాడుతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఊపిరి ఉందేమోనని ఆశతో తాడు తొలగించి కిందుకు దించేసరికి వరుణ్ మృతి చెంది ఉన్నారు. దంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పెళ్లి సంబంధం చూడడమే కారణం
ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకోవాలని వరుణ్‌కుమార్‌ను కుటుంబీకులు కోరగా, ఇంకా కొంత సమయం కావాలని కోరాడు. అయినా కుటుంబీకులు తమ ప్రయత్నాలు మానకుండా బలవంతంగా పెళ్లి సంబంధం కుదుర్చి నిశ్చితార్థం ముహూర్తం కూడా పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబీకులు తెలిపారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ బి.రామకృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శవ పంచినామా నిర్వహించి, మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి కుటుంబానికి డిప్యూటీ సిఎం పరామర్శ
మృతుడి వరుణ్‌కుమార్ కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పరామర్శించారు. మృతుడు తల్లి పైడితల్లమ్మను, మేనమామ అల్లు నాయుడును ఓదార్చారు.










