Oct 19,2022 23:03

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న కెకె.రాజు

ప్రజాశక్తి- సీతమ్మధార : 54వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సచివాలయ సమస్యపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు వినతిపత్రం అందించారు. 1086308 నెంబరుగల సచివాలయం దూరంగా ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు కెకె.రాజుకు విన్నవించిన నేపథ్యంలో దీనిపై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 54వ వార్డు జ్యోతినగర్‌లో ఒక మహిళ ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన 550 చదరపు గజాల విస్తీర్ణంలోని భవనంలో ప్రస్తుతం 1086307 నెంబర్‌ సచివాలయం ఉందని, ఆ భవనాన్ని మూడు అంతస్తులుగా పునర్నిర్నిస్తే, ఈ రెండు సచివాలయాలతోపాటు అంగన్వాడీ కేంద్రం, వార్డు కార్యాలయం అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయని స్థానికులు అభిప్రాయపడుతున్నట్లు కలెక్టర్‌కు రాజు విన్నవించారు. దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారని కెకె.రాజు అన్నారు.