Aug 14,2023 21:44

సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న గిరిజనులు

గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దుడ్డుఖల్లు పంచాయతీలో ఒకటి, రెండు సచివాలయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో దుడ్డుఖల్లు సచివాలయం ఎదుట గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మండంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పంచాయతీలో 2500 మంది ఓటర్లు, 10వేలకు పైగా జనాభా ఉన్నారని తెలిపారు. అయితే సచివాలయం ఏర్పాటు నుంచి ఇక్కడ కేవలం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, మహిళా పోలీస్‌, పంచాయతీ సెక్రెటరీ నలుగురు సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌ లేకపోవడంతో ప్రజలకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడంలేదన్నారు. దీంతో గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పక్షపాతిగా వ్యవహరిస్తూ నలుగురు సిబ్బందితోనే విధులు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. ఉన్నత అధికారులు స్పందించి దుడ్డుఖల్లు పంచాయతీలో రెండో సచివాలయం కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పువ్వుల తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.