
ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రభుత్వం నియమించిన గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు, కోశాధికారి వివి శ్రీనివాసరావు, జేఏసీ జిల్లా శాఖ అధ్యక్షులు ఎస్‌ఎస్‌విఎస్ నాయుడు, కార్యదర్శి లోవరాజు, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు దేవి, గ్రామ వార్డు సచివాలయ యూనియన్ జిల్లా అధ్యక్షులు దిలీప్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ మాట్లాడారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పెట్టిందని, ప్రొబేషన్ పీరియడ్ దాటి 9 నెలలు అయినా తమను రెగ్యులర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 9 నెలల ఎరియర్స్ చెల్లించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్నట్టే తమకు కూడా సెలవులు ప్రకటించిన ఆచరణలో లేదన్నారు. డిజిటల్ అసిస్టెంట్‌లపై పని ఒత్తిడి పెరిగిందని, ఏపీజిఎల్‌ఐ ఇన్సూరెన్స్ బాండ్లు తక్షణమే ఇప్పించాలని, అన్ని రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు.