Nov 02,2023 20:34

నగర పంచాయతీ కార్యాలయం

ప్రజాశక్తి, పాలకొండ :  స్థానిక నగర పంచాయతీ పనితీరు రోజురోజుకు అధ్వానంగా మారుతుంది. 2013 మార్చిలో మేజర్‌ పంచాయితీని నగర పంచాయితీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆది నుంచి నగర పంచాయితీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. దీంతో సరైన సేవలందక ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
పర్యవేక్షించే అధికారులు కరువు
నగర పంచాయితీలో కొంత కాలంగా ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరిపాలన గాడిలో పెట్టాల్సిన మేనేజర్‌ పోస్ట్‌ కొద్దిరోజులు నుంచి ఖాళీగానే ఉంది. ఇక్కడ పని చేసిన మేనేజర్‌ జయరామ్‌ డేప్యూటేషన్‌పై సాలూరు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వెళ్లిపోవడంతో ఆ పోస్టు ఖాళీ ఏర్పడింది. సుమారు ఆరు నెలల నుంచి టిపిఎస్‌ పోస్ట్‌ ఖాళీగా ఉంది. టిపిఎస్‌గా పని చేసిన సత్యనారాయణ ఆమదాలవలస బదిలీపై వెళ్లిపోవడంతో సచివాలయ కార్యదర్శులతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నడుస్తుంది. కొంత కాలం క్రితమే ఎఇగా ఉన్న కిరణ్‌ నెల్లిమర్లకు బదిలీ అయిపోవడంతో సచివాలయం ఇంజనీరింగ్‌ కార్యదర్శులు ఈ బాధ్యతలు చూస్తున్నారు. ప్రధానంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టిన నాథుడే కరువయ్యాడు.
సమయానికి రారు
అసలే సిబ్బంది కొరత. కీలక పోస్టులతో పాటు కింది స్థాయిలో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు కూడా పూర్తిస్థాయిలో విధులపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం కమిషనర్‌ తో పాటు మిగిలిన సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కాలేదు. మధ్యాహ్నం 12గంటల సమయంలో కూడా రెగ్యులర్‌ ఉద్యోగులెవరూ కార్యాలయంలో లేని పరిస్థితి. అకౌంటెంట్‌ సీతంపేట ఐటిడిఎకు వెళ్లగా, సీనియర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్‌ ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని పరిస్థితి. కమిషనర్‌ తన కార్యాలయనికి వస్తారో, రారో కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. దీనితో వివిధ పనుల మీద వచ్చిన ప్రజలు నిరాశతో వెనుతిరిగారు.