Nov 18,2022 22:29

ప్రజాశక్తి - టి.నరసాపురం
           మండలంలోని వెలగపాడు పంచాయతీలో గ్రామ సచివాలయ భవన నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లా పంచాయతీ అధికారి నిమ్మగడ్డ బాలాజీ శుక్రవారం గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించారు. మండలంలోని వీరభద్రవరంలో శుక్రవారం సర్పంచి నయనారపు జలపాలు అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ముఖ్యఅతిథిగా డిపిఒ విచ్చేశారు. వెలగపాడు పంచాయతీలో నూతన సచివాలయ భవన నిర్మాణ విషయంలో వెలగపాడు, వీరభద్రవరం గ్రామాల ప్రజల మధ్య వివాదం నెలకొంది. తమ గ్రామంలోనే సచివాలయం నిర్మించాలని ఇరు గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం పరిష్కారానికి కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాలతో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. వీరభద్రవరంలో సచివాలయం నిర్మించాలని 262 మంది చేతులెత్తి తమ ఆమోదం తెలిపారు. వెలగపాడు గ్రామంలోగాని, వెలగపాడు, వీరభద్రవరం గ్రామాల మధ్యగాని సచివాలయం నిర్మించడానికి ఎవరూ ఆమోదం తెలపలేదు. దీంతో గ్రామ సభ తీర్మానం జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు నివేదించి ఆయన ఆదేశాలతో తదుపరి కార్యాచరణ చేపడతామని డిపిఒ బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఒ ఎస్‌ఎస్‌.నగేష్‌, ఎంపిపి డి.లక్ష్మి, తహశీల్దార్‌ జెవి.సుబ్బారావు, ఎంపిడిఒ ఎన్‌.తిరుపతిస్వామి, పిఆర్‌ ఎఇ సంపతకుమారి, ఎంపిటిసి మామిళ్లపల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.