ప్రజాశక్తి - జీలుగుమిల్లి
రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా 2019లో నూతన సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. నూతన పాలనకు సంబంధించి నూతన భవన నిర్మాణాలకు అప్పట్లో శంకుస్థాపనలు కూడా అట్టహాసంగా ప్రారంభం చేశారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్‌లు సైతం పోటీ పడటంతో వారికి పనులు అప్పగించింది. జీలుగుమిల్లి మండలంలోని మొత్తం 12 పంచాయతీలకు గాను 11 సచివాలయ భవనాల నిర్మాణాలను రెండు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్లు ప్రారంభం చేశారు. అయితే నిర్మాణ పనులకు సంబంధించి మొదట్లో త్వరితగతిన పనులు చేపట్టారు. తర్వాతి కాలంలో బిల్లులు కాస్త ఆలస్యం అయ్యేసరికి నిర్మాణాలను కొన్ని చోట్ల సగంలోనే నిలిపేశారు. దీనిపై ప్రభుత్వం నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను మంజూరు చేసి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు మండలస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఎట్టకేలకు మండలంలో నాలుగు పంచాయతీల పరిధిలో మాత్రమే పూర్తిస్థాయిలో పనులు జరిగి నూతన సచివాలయలను ప్రారంభం చేశారు. వాటిలో పాలన కొనసాగిస్తున్నారు. మిగతా చోట్ల తాత్కాలిక భవనాలలోనే పాలన కొనసాగిస్తున్నారు. ఇంకా మొత్తం 8 పంచాయతీలలో కొన్ని చోట్ల మాత్రం భవనాలు పూర్తవుతున్నాయి. మిగిలిన పంచాయతీలలో మాత్రం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఓ పక్క, అధికారుల అలసత్వంతో భవన నిర్మాణాలు అసంపూర్తిగా నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. జిల్లా యంత్రాంగం స్పందించి మండల అధికారులపై ఒత్తిడి తెచ్చి, కాంట్రాక్టర్లతో పనులను పూర్తి చేయించాలి. పూర్తిస్థాయిలో సచివాలయాల నూతన భవనాల్లో పాలనను కొనసాగించాలని ప్రజలు వేడుకుంటున్నారు.










