ప్రజాశక్తి-రావికమతం :
మండలంలో గుడ్డిప గ్రామ సచివాలయం, విలేజ్ క్లినిక్ పై తలెత్తిన సమస్య చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. ఈ సమస్యపై ఆదివారం గుడ్డిప గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ ఎలక్షన్స్‌కు ముందు సచివాలయం, ఆర్‌బికేల నిర్మాణానికి అధికారులు అనుమతులు ఇవ్వగా గ్రామానికి చెందిన అధికారి సత్యారావు భార్య సత్తమ్మ సుమారు 1,80,000 వేలు ఖర్చు చేసి గ్రామస్తులు సూచించిన సర్వే నెంబరు 27లో సచివాలయ నిర్మాణ పనులను చేపట్టారు. పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామ సర్పంచ్ గుమ్మాల గణేశ్వరరావు సర్వే నెంబర్ 148 ప్రభుత్వ భూమిలో సచివాలయం నిర్మించాలని పట్టుబట్టారు. గతంలో చేపట్టిన నిర్మాణాన్ని కాదని వేరే స్థలానికి మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందని గ్రామ పెద్దలు సర్పంచును నిలదీశారు. గుడ్డిప, కొత్తూరు, గదబపాలెం గ్రామాల మధ్యలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సచివాలయం నిర్మాణం చేపట్టాలని గ్రామ పెద్దలు తీర్మానం చేశారు. ఇప్పుడు అక్కడ కాదని వేరే స్థలంలోకి మారుస్తానంటే పెట్టుబడి పెట్టిన సొమ్ము పరిస్థితి ఏమిటని గ్రామస్తులు నిలదీశారు.
ఇదిలా ఉండగా 148 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి చెరువు గర్భం కావడంతో అక్కడ సచివాలయం నిర్మించడానికి వీలులేదని గ్రామానికి చెందిన మజ్జి అప్పారావు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సమస్య ఇలా ఉండగా గ్రామస్తులు తర్జనభర్జంలో పడుతూ ఒకరిపై ఒకరు దుర్భాసలాడుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పలువురు పెద్దలు అభిప్రాయ పడ్డారు. గ్రామ సర్పంచ్ అబివృద్ధిని అడ్డుకోవడం సమంజసం కాదని పలువురు పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడ్డూరి సత్యారావు, గల్లా సత్యారావు, మజ్జి అప్పారావు, సోమిరెడ్డి నాగేశ్వరరావు, మజ్జి నాగేశ్వరరావు, గల్లా సంజీవ్గు, పరశురాము, సత్తిబాబు, అప్పారావు, పలువురు పెద్దలు పాల్గొన్నారు.










