సచివాలయ భవన నిర్మాణ సిమెంట్ మాయం చేశారు..
తిరుపతి జెసికి ఫిర్యాదు
ప్రజాశక్తి - బాలాయపల్లి: రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం నిర్మాణం కోసం పంపిణీ చేసిన సిమెంటును మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ బట్టేపాటి మురళీమోహన్ రెడ్డి మాయం చేశారని మండల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 'జగనన్నకి చెప్పుకుందాం'లో గ్రామస్తులు తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ డి.కె బాలాజీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సచివాల యం నిర్మాణం కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన సిమెంటును మాయం చేయడం వల్ల పిల్లర్లకు ఏర్పాటు చేసిన కమ్మి తుప్పు పట్టి పోయిందన్నారు. స్పందించిన జెసి పంచాయతీరాజ్ శాఖ ఎస్ ఈ కి చరవాణి ద్వారా వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా బాలాయపల్లి మండలంలో పదివేల సిమెంటు బస్తాలు అన్యాక్రాంతమయ్యాయన్నారు. మన్నూరు కొత్తూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగావుందని జెసి దష్టికి తీసుకొచ్చారు. చేతి బోరు పైపులు గ్రామ సర్పంచి ఎవరికీ తెలియకుండా మాయం చేశారని తెలిపారు. తాగేందుకు మినరల్ వాటర్ కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. పశువులకు నీళ్లు లేక అల్లాడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి పరిష్కరించకపోతే పోరాడుతామన్నారు. గొట్టికాడ గ్రామంలో అంగనవాడి భవనం నిర్మించాలని ఆ గ్రామ సర్పంచి వెందోటి సుప్రజ జెసికి విన్నవించారు.
తక్షణమే పరిష్కారం: జెసి
మండలంలోని 24 పంచాయతీలకు సంబంధించి వివిధ సమస్యలపై 117 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వారం రోజుల్లో వాటికి పరిష్కార మార్గం చేపడుతారని జెసి బాలాజీ పేర్కొన్నారు. మండలంలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయని, భూ సమస్యలు ఉన్నవారు కోర్టుకు వెళ్లి పరిష్కరించు కోవాలని ఆదేశించారు. అంతే కాకుండా భూ సమస్యలపై వెంటనే పోలీసులు కేసులు నమోదు చేసి ఇరు వర్గాలను పిలిపించి పూర్తి హక్కు వున్న వారికే ఆ భూమి హక్కు కల్పించేందుకు రెవెన్యూ శాఖకు సహకరించాలని పోలీసులను ఆదేశించారు. అర్హత ఉన్నవారికి పింఛను వెంటనే వచ్చేలా ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని జిల్లా డిఆర్డిఏ పీడీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు వెందోటి కార్తీక్ రెడ్డి, రాయి దేవిక చౌదరి, గొట్టికాడు గ్రామ సర్పంచి వెందోటి సుప్రజా, తులసి రెడ్డి, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, మండల శాఖ అధికారులు పాల్గొన్నారు.










