
ప్రజాశక్తి -రావికమతం: రావికమతం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ పైలా రాజు అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి పలువురు మండల స్థాయి అధికారులు డుమ్మా కొట్టడంపై సభ్యులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుపాక సచివాలయ పరిధిలో ఐదు శివారు గ్రామాలకు వైద్యం అందటం లేదని ఆయా గ్రామాలకు కూడా 104 వైద్యులతో కూడిన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ ముచ్చ సూర్యనారాయణ సభ దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ వాత్సల్య పథకానికి ఒంటరి మహిళగా జీవిస్తున్న వారికి విడాకులు పత్రాలు ఇప్పుడు కావాలంటే ఏ రకంగా తెచ్చుకోవాని కొత్తకోట ఎంపీటీసీ పూడి దేవా సభ దృష్టికి తెచ్చారు. కళ్యాణపులోవ రిజర్వాయర్ కాలవ గండి పడితే దానిని నేటికీ పూడ్చక పోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇరిగేషన్ అధికారిపై టి అర్జాపురం సర్పంచ్ మడగల పాల్గున తెలిపారు.. మండలంలో పలు గ్రామాలలో నీటి ఎద్దడి నెలకొందని, దానికి తగు చర్యలు చేపట్టాలని పలువురు తెలిపారు. చేతి పంపు బోర్లకు కావలసిన విడి పరికరాలను గ్రామపంచాయతీల నుంచి కొనుక్కోవడానికి అనుమతులు ఇవ్వక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చీమలపాడు సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు, వైస్ ఎంపీపీలు దంట్ల రమణ, భవాని ప్రసాద్, ఎంపీడీవో వెంకన్న బాబు, తహశీల్దారు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.