నిత్యం రద్దీగా ఉండే ఆ మహానగరంలో అక్కడొక పెద్ద మలుపు. ఈ మధ్య రోడ్డు వెడల్పు చేసే పనుల్లో తొలగించిన ఒక పెద్ద బండరాయిని సరిగ్గా ఆ మలుపు దగ్గరే వదిలేశారు. అక్కడ కనీసం విద్యుద్దీపం కూడా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దానిని తప్పించుకుని పోతున్నారేగానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఒకరోజున దీపక్ పాఠశాలకి వెళుతూ ఆ రాయిని చూశాడు. దానిని తొలగించకపోతే ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించాడు. తన సైకిల్‌ని ఓ వారగా పెట్టి, వెళ్తున్న వారిని దానిని పక్కకు నెట్టమని అడగసాగాడు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ బండరాయిని తొలగించడానికి తన శక్తి చాలదని దీపక్‌కు తెలుసు. ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో అర్థం కాలేదతనికి. అలాగని అందరిలా మనకెందుకులే అంటూ తను కూడా వెళ్ళిపోవడానికి అతని మనసాక్షి ఒప్పుకోలేదు. అందుకే తోటి విద్యార్థులను సహాయం చేయమని అడిగాడు. కానీ వాళ్లు 'స్కూలుకు టైం అవుతోంది.. మేం వెళుతున్నాం!' అంటూ ఆగకుండా వెళ్లిపోతున్నారు.
'చీకటిపడితే అడ్డుగా ఉన్న ఆ బండరాయిని ఏదైనా వాహనం గుద్దుకుని, పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందువల్ల తనొక్కడైనా ఏదో ఒకటి చేసి బండరాయి లేకుండా చేయాలి!' అనుకున్నాడు దీపక్. ఒక ప్రయత్నంగా అక్కడ నిల్చున్న కొందరు కూలీలతో ఈ సంగతి చెప్పాడు. వాళ్ళు పకాలున నవ్వి 'ఎవరికీ లేని బాధ నీకెందుకు? బుద్ధిగా చదువుకోక... చూడు ఒక వెయ్యి రూపాయలిస్తావా? దాన్ని అక్కడ నుంచి తీసి దూరంగా పడేస్తాం' అన్నారు.
తనకెవరూ సహాయం చేయరని నిర్ణయించుకున్నాడు. వెంటనే రోడ్డు మధ్యలోకొచ్చి నిలుచున్నాడు దీపక్. అతన్ని తప్పుకో అన్నట్లుగా సైగ చేసి పక్క నుంచి పోతున్నారు కొందరు, కోపంగా కసురుతున్నారు మరికొందరు. అయినా దీపక్ అక్కడ నుంచి కదల్లేదు. కొంత సమయం తర్వాత రోడ్డుకి మధ్యలో పడుకున్నాడు. అంతే సుడిగాలిలా దూసుకొస్తున్న వాహనాలన్నీ హఠాత్తుగా ఆగిపోయాయి.
ఒక ప్రయాణీకుడు కారు దిగి 'ఏరు! నీకు బుద్ధిలేదూ! రోడ్డుకి మధ్యగా పడుకున్నావు. నీవల్ల ఎన్ని వాహనాలు ఆగిపోయాయో చూసావా?' అని గట్టిగా అరిచాడు. అయినా అలాగే ఉండిపోయాడు దీపక్. కొంత సమయంలోనే ఆ దారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. దాంతో దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు విజిల్ వేసుకుంటూ గబగబా దీపక్ దగ్గరకు వచ్చాడు. 'లేలే... రోడ్డుకి అడ్డంగా లే?' అన్నాడు.
'నేను రోడ్డుకి అడ్డంగా పడుకోవడం వల్ల ఏమిటి ఇబ్బంది?' అని అడిగాడు దీపక్ ధైర్యంగా.
'రోడ్డుకి అడ్డంగా ఉంటే నీకు ప్రమాదం. పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లే ఇక్కడి నుంచి' అంటూ గట్టిగా అరిచాడు పోలీసు.
' సార్! అడ్డంగా పడుకుంటే నాకు ప్రమాదమని అంటున్నారు. మరి ఈ మలుపు దగ్గర బండరాయి పడి ఉంటే అందరికీ ప్రమాదం కాదా? అది మీకు అడ్డంగా కనిపించలేదా? అదెంత ప్రమాదమో మీకు తెలీదా?' అని ఎదురు ప్రశ్నించాడు.
'ముందు లే! తర్వాత దాని సంగతి చూద్దాం..!' అన్నాడు. 'లేవనంటే లేవను' అంటూ దీపక్ మొండికేశాడు.
'చిన్న పిల్లాడు పదిమంది మేలుకోసం చేసే ప్రయత్నంలో నేనెందుకు భాగస్వామిని కాకూడదు?' అనుకున్నాడు పోలీసు.
అంతే అక్కడున్న వాళ్లందరినీ పిలిచి, బండరాయిని పక్కకు నెట్టేశారు. దీపక్ 'పోలీసు అంకుల్ థాంక్స్!' అని చెప్పి స్కూలుకు వెళ్లాడు.
మర్నాడు పేపర్లో దీపక్ చేసిన పని గురించి మెచ్చుకుంటూ వార్తలొచ్చాయి. ధైర్యాన్ని ప్రదర్శించిన దీపక్‌ను పాఠశాలలో అందరూ ప్రశంసించారు.
- కె.కె.రఘునందన 97054 11897