Jul 14,2023 21:53

ఫొటో : టమోటాలను అందజేస్తున్న నాయకులు

సబ్సిడీ టమోట విక్రయకేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగి పేద ప్రజలకు భారంగా మారిన టమోటాలను తక్కువ ధరకు అందించేందుకు ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి సహకారంతో వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో సబ్సిడీపై ప్రజలకు టమోటాలు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని ఆత్మకూరు మార్కెట్‌ కమిటీ గౌడౌన్‌లో సబ్సిడీపై టమోటా విక్రయాలను లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు కిలో రూ.50లకు టమోటాలను అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం టమోటా ధరలు రూ.140కు పలుకుతున్న దృష్య్టా ప్రజలంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం రూ.50కే కిలో టమోటా అందించేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రజలంతా ఈ సబ్సిడీ టమోటా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం విక్రయ కేంద్రానికి వచ్చిన ప్రజలకు టమోటాలను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, సిండికేట్‌ ఫార్మర్‌ సొసైటీ చైర్మన్‌ నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, యువ నాయకులు నోటి వినరు కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.