
ప్రజాశక్తి - పంగులూరు: సబ్సిడీ ధరపై శనగల కొనుగోలును ఎంపీపీ తేళ్ల నాగమ్మ, జడ్పిటిసి రాయిని ప్రమీల బుధవారం ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం-1లో రైతులకు సబ్సిడీ ధరపై శనగ విత్తనాల అమ్మకాన్ని ప్రారంభించారు. ఎఒ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మండలంలో జేజే-11, కాక్-2 రకం శనగ విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నామని చెప్పారు. జేజే-11 రకం శనగ విత్తనాలు మండలానికి 685 క్వింటాళ్లు వచ్చాయని తెలిపారు. క్వింటా ధర రూ.8,100 అని తెలిపారు. వీటిని 40శాతం రాయితీపై రైతులకు రూ.4,860లకు ఇస్తున్నామని అన్నారు. ఇందులో రైతుకు సబ్సిడీపై రూ.3,240అందుతుందని తెలిపారు. కాక్-2 రకం శనగలు మండలానికి వెయ్యి క్వింటాళ్లు వచ్చాయని అన్నారు. వీటి ధర క్వింటా రూ.14,050లు ఉందని, వీటికి కూడా 40శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తనాలు క్వింటాకు రూ.5,620లు రాయితీ పోను రైతులు రూ.8,430లు చెల్లించాల్సి ఉందని అన్నారు. మండలంలోని ఆర్‌బికెల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు యూరియా, డిఏపి, 20:20, 10:26:26 ఎరువులను ఎమ్మార్పీ రేట్లకే అమ్ముతున్నామని తెలిపారు. కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు ఇవ్వటం లేదని తెలిపారు. గతంలోనే కలెక్టర్‌కు, జెడిఏకు, ఏడిఏకు తెలిపామని అన్నారు. అయినా ఈ సమస్యను ఇంతవరకు పరిష్కారం చేయలేదని తూర్పు కొప్పెరపాడుకు చెందిన కౌలు రైతు ఎనికపాటి శ్రీనివాసరావు తెలిపారు. సెనగలు విత్తుకునే సీజన్ దాటిపోతుందని అన్నారు. అధికారులు ఈ విషయమై వెంటనే నిర్ణయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఏఏఓ అమత, మండల అభివద్ధి కమిటీ అధ్యక్షులు రాయని వెంకటసుబ్బారావు, రైతులు ఎనికపాటి శ్రీనివాసరావు, గాదే బ్రహ్మారెడ్డి, చిలుకూరి వీర రాఘవయ్య, అడ్డగిరి రాఘవులు, అద్దంకి ఉమ్మయ్య పాల్గొన్నారు.