ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : ప్రభుత్వం సబ్సిడీ ధరకు బియ్యం, కందిపప్పు అందజేస్తున్నట్టు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం స్థానిక రాయగడ ప్రధాన రహదారిలో గల శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సబ్సిడీ ధరలతో కూడిన సరుకులు బిపిటి గ్రేడ్-1 రకం, కంది పప్పు గ్రేడ్-1 రకం పంపిణీ ప్రత్యేక కౌంటర్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు పాల్గొని కౌంటర్లు ప్రారంభించి వారి చేతులు మీదుగా సబ్సిడీ సరుకులు ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం జెసి మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో అధిక ధరల నియంత్రణకు పేదలకు అందుబాటు ధరలో నిత్యావసర సరుకుల పంపిణీకి టోకు వర్తకుల సహకారంతో ప్రభుత్వం సబ్సిడీ ధరలకు గ్రేడ్-1 బియ్యం, గ్రేడ్-1 కంది పప్పు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు వచ్చేందుకు జిల్లాలో 7 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో భాగంగా పార్వతీపురం 2 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్యే ఈ ప్రత్యేక కౌంటర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో ధరలను అదుపు చేసేందకు అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు, జెసిఎస్ కన్వీనర్ జి.మాధవరావు, డిఎస్‌ఒ ఆర్.శివప్రసాదరావు, వర్తక వాణిజ్య సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు, వైసిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. పట్టణంలోని చిన బజార్, నెయ్యిలవీధిలో టోకు వర్తకుల చేత బియ్యం, కందిపప్పు చౌకగా అమ్మకాలను ఆమె ప్రారంభించారు. మార్కెట్ లో పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బియ్యం, కందిపప్పు విక్రయించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో వుండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ హెచ్ శంకరరావు పాల్గొన్నారు.










