ప్రజాశక్తి - శ్రీకాకుళం: అయ్యప్ప యాత్రికులు శబరిమలను దర్శించుకునేందుకు శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), విశాఖపట్నం నుంచి వేర్వేరుగా రెండు ప్రత్యేక రైళ్లను ప్రారంభించనున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. శబరిమలకు ప్రత్యేక రైలును ప్రారంభించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన డిమాండ్‌కు ఈస్ట్‌కోస్ట్ రైల్వే జిఎం ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ నుంచి మాత్రమే ఏటా సీజన్ కొల్లాంకు ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి తొలిసారిగా శబరిమలైకు ప్రత్యేక రైళ్లు మంజూరయ్యాయి. వీటి కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు... జిఎం, వాల్తేరు డిఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. తమ ప్రాంతవాసుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆమోదించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలియజేశారు.
రైళ్ల సమయాలు ఇవే...
శ్రీకాకుళం రోడ్డు-కొల్లాం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (08537 / 08538) నవంబర్ 25 నుంచి జనవరి 27 వరకు ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ(బైపాస్) మీదుగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కొల్లాంలో ఆదివారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి, సోమవారం రాత్రి రెండు గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్, జనరల్ బోగీలు సహా 22 కోచ్‌లు ఉంటాయి.
విశాఖపట్నం-కొల్లాం వీక్లీ స్పెషల్ రైలు (08539 / 08540) నవంబర్ 29 నుంచి జనవరి 31వ తేదీ వరకు ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు ప్రారంభం కానుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి మీదుగా ప్రయాణించి, గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. కొల్లాంలో ప్రతి గురువారం రాత్రి 7.35 గంటలకు బయలుదేరి, శుక్రవారం రాత్రి 11.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.