- ఆటో, ట్రాలీ ఆటో ఢకొీని
16 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమం
ప్రజాశక్తి-చింతూరు
చింతూరు మండల కేంద్రంలోని శబరి బ్రిడ్డిపై శనివారం మధ్యాహ్నం ఆటో, ట్రాలీ ఢకొీన్న ప్రమాదంలో 16 మంది వ్యవసాయ కూలీలు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చింతూరుకు చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు కూనవరంలో మిర్చి కోతలకు వెళ్లి తిరిగి చింతూరు స్వస్థలానికి మూడు చక్రాల ఆటోలో శనివారం మధ్యాహ్నం వస్తున్నారు. శబరి నది వంతెనపై కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను హఠాత్తుగా ఎదురుగా వచ్చిన ట్రాలీ ఆటో బలంగా ఢకొీంది. ఈ ప్రమాదంలో ఆటోల ప్రయాణిస్తున్న 15 మందితో పాటు ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 వాహనంలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆటో డ్రైవర్ సూర్యకుల రమేష్, ఆ ఆటోలో ప్రయాణిస్తున్న కోట్ల హర్షవర్ధన్, ట్రాలీ ఆటోలో ఉన్న వెంకట్ తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. వారి ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కురసం కుమారి, సూర్యకుల పోచమ్మ, మడకం నాగమణి, మడకం అచ్చమ్మ, సూర్యకుల వరలక్ష్మి, చక్కని సుధా, మడకం రాములమ్మ, రవ్వ కృష్ణమ్మ, మడకం సుబ్బారావు, పట్రాబోతుల రమణమ్మ, ఎర్రం మహాలక్ష్మి, పెనబోయిన ఇందిర, సోడె భద్రమ్మ తదితర 13 మంది చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల బంధువులతో ఆసుపత్రి కిటకిటలాడింది.
క్షతగాత్రులను చూడటానికి వస్తుండగా ప్రమాదం
ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను చూడటానికి ద్విచక్ర వాహనంపై యువకులు వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎర్ర యోహాన్, దిలీప్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో యోహాన్ అనే యువకుడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు.










