సబ్‌ఛార్జీల పేరుతో ప్రజలపై భారం
ప్రజాశక్తి-బిట్రగుంట : రాష్ట్ర ప్రభుత్వం సబ్ ఛార్జీల పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు రెహనా బేగం పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేసిన అధిక ధరలకు నిరసనగా సోమవారం బోగోలు సిపిఎం ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తహశీల్దార్ ఎంపిడిఒకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యురాలు రెహనా బేగం, బోగోలు మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయని తెలిపారు. కేంద్రం విధించిన షరతులకు ఒత్తిడికి తలవంచి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజలపై అధిక భారాన్ని మోపుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యవసర వస్తువులపై పెనుభారాన్ని మోపారని తెలిపారు. సామాన్యులు బతకలేని పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. రాష్ట్రంలో మంచి చదువులు చదువుకొని ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతులకు ఇళ్లకు స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి చల్ల నరహరి, సిపిఎం మండల సెక్రెటరీ గడ్డం వెంకయ్య, మండల కమిటీ సభ్యులు దమ్ము శంకరయ్య, సిపిఎం సీనియర్ నాయకులు దమ్ము భాస్కర్, విశ్వనాథరావుపేట శాఖ సభ్యులు ఎన్ రామయ్య, సిఐటియు మండల ఉపాధ్యక్షులు ఎస్.కె అన్వర్ భాషా, కడనూతల శాఖ సభ్యులు పొట్లూరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.










