Jul 26,2023 22:35

మాట్లాడుతున్న డిఇఇ అనంతరావు

ప్రజాశక్తి- పలాస: పలాస నియోజకవర్గం పరిధిలో 10,947 జగనన్న ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 5,188 ఇళ్లు పూర్తయ్యాయని హౌసింగ్‌ డిఇఇ రెడ్డి అనంతరావు తెలిపారు. ఎంపిడిఒ కార్యాలయంలో హౌసింగ్‌ అధికారులతో, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో 69 జగనన్న లేఅవుట్లలో ఈ నెలాఖరు నాటికి 82 శాతం ఇళ్లు పూర్తవుతాయని అన్నారు. జగనన్న లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు ఇంటి ముందు ఇంకుడు గుంతలు తవ్వుకొనేందుకు రూ.6 వేలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. గతంలో ప్రభుత్వ హౌసింగ్‌ మంజూరై ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించకపోతే అటువంటి లబ్ధిదారులకు రూ.12 వేలు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల సర్వే చేయాలన్నారు. గతంలో ఇళ్లు లేనప్పుడు ఏలా ఉన్నారు? ఇళ్లు నిర్మించుకున్న తర్వాత ఎలా ఉంటున్నారో లబ్ధిదారుల నుంచి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. సమావేశంలో ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు, హౌసింగ్‌ ఎఇ డొక్కా వైకుంఠరావు పాల్గొన్నారు.