ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
తిమ్మాపురంలోని సౌత్ స్టార్ సిరామిక్ ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల సుమారు 20 ఎకరాల్లో దెబ్బతిన్న వివిధ పంటలను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు బుధవారం పరిశీలించారు. సిరామిక్ ఫ్యాక్టరీ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను గాలికొదిలి కాలుష్యాన్ని అంతా రైతుల పంట పొలాలపై వదిలి తీవ్ర నష్టానికి గురి చేయడం దారుణమన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి రైతులు దఫదఫాలుగా విన్నవించినా, ఆందోళన చేసినా అదిగో.. ఇదిగో అని కాలక్షేపం చేయడం తప్ప కాలుష్య నియంత్రణకు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రైతుల నోట్లో మట్టి కొట్టడమేనని ఆయన అన్నారు. గ్యాస్ పైప్‌లైన్ పనులు రెండు సంవత్సరాలుగా చేస్తున్నా నేటికీ పూర్తి చేయలేకపోవడం ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. రెండు సంవత్సరాలుగా 20 మంది రైతులు పంటలు పండక లక్షలాది రూపాయలు నష్టపోయారని, తక్షణమే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నష్టపోయిన రైతులు పెళ్లి గాంధీ, బొక్కా సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ వేలాది రూపాయలు కౌలు చెల్లిస్తూ, మరోవైపు సాగుకు పెట్టుబడి పెట్టి రూ.లక్షలు నష్టపోయామని వాపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తప్ప వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దెబ్బతిన్న మొక్కజొన్న పొత్తులను ప్రదర్శిస్తూ ఫ్యాక్టరీ గేటు ముందు రైతులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు. ఫలితంగా సౌత్ స్టార్ సిరామిక్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులతో చర్చలు జరిపింది. ఈ నెలాఖరులోపు రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.










