ప్రజాశక్తి - భీమడోలు
స్వచ్ఛంద సంస్థ మానవత చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యావ్యాప్తికి, ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని సంస్థ జిల్లా సమన్వయకర్త రామిశెట్టి గంగాధరరావు తెలిపారు. పూళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ఇన్ పేషెంట్లు సౌకర్యార్థం అధునాతన వసతులతో కూడిన రూ.35 వేల విలువగల బెడ్‌ను కైకరంకు చెందిన దాత శానం పెదబాబు భీమడోలు మానవత శాఖ ద్వారా శనివారం ఆరోగ్య కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా జరిగే ప్రసవాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పసిపిల్లల వైద్యం కోసం కొన్ని అదనపు సౌకర్యాలు కావాలని మానవత శాఖ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన మానవత భీమడోలు శాఖ పసిపిల్లల వైద్యానికి అవసరమైన బేబీ వార్మర్, ఇంక్యుబిలేటర్, ఇతర సౌకర్యాల కల్పనకు రూ.65 వేల కేటాయింపు సంసిద్ధతను వెల్లిబుచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన సంస్థ భీమడోలు శాఖ డైరెక్టర్ కేతినీడి విశ్వేశ్వరరావు తన వంతు సహాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. పూళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చిన దాతలను భీమడోలు మానవత శాఖ సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు రీజియన్ ఛైర్మన్ పుప్పాల గోపితో పాటు భీమడోలు, ఉంగుటూరు మండలాలకు చెందిన మానవత శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.










