
రత్నగిరి యువరాణి పెళ్లీడుకు రావడంతో మహారాజు మణివర్మ దండోరా వేయించాడు. యువరాణి పెట్ట బోయే పరీక్షలలో నెగ్గిన వారికి రాజ్యము వదిలి, తాను మహారాణితో తీర్థయాత్రలకు వెళతానని ప్రకటించాడు. ఆ ప్రకటన చూసి, వెళ్లి వచ్చిన ఎందరో విఫలమయ్యారు. యువరాణి పెట్టే పరీక్షలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. ఒకరోజు నలుగురు వ్యక్తులు ఒకేసారి వచ్చారు. వారిని వేరు వేరుగా పిలిచి, మాట్లాడింది సౌధామిని అంతరంగికురాలు మాలతి.
'యువరాణి భవనంలోకి వెళ్ళే ముందు అక్కడ రాసి ఉన్న ప్రశ్న చదువుకునే లోపలికి వెళ్ళాలి. ఇష్టం లేకపోతే వెనుతిరిగి వెళ్ళొచ్చు!' అంది మాలతి. దానికి నలుగురు సరేనన్నారు. ఒక్కొక్కరిని భవనంలోకి ప్రవేశపెట్టింది. మొదటగా వెళ్ళిన వ్యక్తి ఆ ప్రశ్న ఇలా చదువుకున్నాడు. ''రాణిగారికి ఎడమ కాలు, కుడి చేయి పనిచేయదు. సపర్యలు చేయాలి. అలా చేయగలిగినవారే లోపలికి అడుగు పెట్టాలి'' అని రాసుంది. అది చదువుకుని వెను తిరిగాడు మొదటి వ్యక్తి.
రెండవ వ్యక్తిని ప్రవేశపెట్టింది మాలతి. అక్కడ రాసిన ప్రశ్న ఇలా చదువుకున్నాడు. ''యువరాణికి రెండు కాళ్ళు, చేతులు పనిచేయవు. ఆమెకు సేవ చేస్తూ పరిపాలన సాగించాలి'' అని ఉంది. అది చదువుకుని వెనుతిరిగాడు రెండవ వ్యక్తి. మూడవ వ్యక్తిని ప్రవేశపెట్టింది మాలతి. అక్కడ రాసి ఉన్న ప్రశ్న ''రాణిగారు కోమాలో ఉన్నారు. కోలుకునే వరకు సపర్యలు చేయాలి, పరిపాలనా సాగించాలి!'' అది చదువుకుని వెనుతిరిగాడు మూడవ వ్యక్తి. ఇక చివరగా నాలుగవ వ్యక్తిని ప్రవేశపెట్టింది మాలతి. అక్కడ రాసి ఉన్న ప్రశ్న చదువుకున్నాడు. ''రాణి పుట్టు గుడ్డి, పైగా మాట రాదు. వినపడదు. రాణిగారికి సపర్యలు చేస్తూ, పరిపాలన సాగించాలి'' అని రాసుంది. అది చూసి చిరునవ్వుతో ధైర్యంగా లోపలికి వెళ్ళాడు ఆ వ్యక్తి. విశాలమైన ఆ భవనంలో ఎవరూ కనపడలేదు. చుట్టూ చూశాడు. ఓ మధుర కంఠంతో 'వెనుతిరిగి చూడు' అని వినపడింది. తల తిప్పి చూసి, తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అపూర్వ సౌందర్యరాశి మేలి ముసుగులో మెరిసిపోతోంది. ఆమే సౌధామిని. చేతిలో సుగంధ పూలమాలతో దగ్గరకు రమ్మని సైగ చేసింది. ఆమె దగ్గరకు వెళుతున్న ఆ వ్యక్తిని ''యువరాణి ప్రశ్న చదివి, ధైర్యంతో ముందుకు వచ్చారు. మీ పేరు చెప్పి, యువరాణిపై మీ అభిప్రాయం ఏమిటి?'' అని అడిగింది మాలతి.
దానికి అతడు చిరునవ్వుతో 'నా పేరు కార్తికేయుడు. రాజుకు కావాల్సింది అందం కాదు. ప్రజల సంక్షేమం, ప్రజల ఈతిబాధలు, జీవన సహచరి నిజంగా పుట్టు గుడ్డి అయి ఉంటే, ఆమెకు నా కళ్ళతో ఈ లోకాన్ని చూపేవాడిని. అన్నీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పి, సమయం కేటాయించేవాడిని' అని చెప్పాడు. ఆ సమాధానం విని సౌధామిని సుగంధమాల అతడి మెడలో వేసింది.
'ఈ రాజ్యానికి ఈ క్షణం నుంచి నీవే మహారాజువి. నీ పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడపాలి' అంటూ రాజు, రాణి నవ దంపతులను ఆశీర్వదించి, తీర్థయాత్రలకు వెళ్లారు.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027