Feb 17,2023 23:10

ప్రజాశక్తి-కంచికచర్ల: మహాశివరాత్రికి మండలంలో శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. చెవిటికల్లులో కృష్ణానది ఒడ్డున ఘాట్‌ వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేశారు. అమరావతి వైపు నుండి చెవిటికల్లు వద్ద కృష్ణా నది ఒడ్డున గల తాగునీటి పైలెట్‌ ప్రాజెక్ట్‌కు వచ్చే పాయనుండి ఘాట్‌ వరకు జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి కనగాల రవికుమార్‌ ఆధ్వర్యంలో నది ఒడ్డున పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి చేశారు. మున్నలూరు ఘాట్‌ వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. కంచికచర్ల బైపాస్‌ రోడ్డు సమీపంలో గల శివసాయి క్షేత్రం, కంచికచర్లలో గల శివాలయాలను అలంకరించారు. ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి, పవిత్రసంగమం, జూపూడి, మూలపాడు, కొటికలపూడి, చిలుకూరు దాములూరు ఘాట్‌లలో యాత్రికులు స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. గుంటుపల్లి వద్ద ఇఒ వలీ, జూపూడిలో ఇఒ మునేశ్వరరావు ర్పాట్లను పర్యవేక్షించారు. పవిత్ర సంగమం వద్ద ఘాట్లను కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌.వెంకటేశ్వర్లు సిబ్బందితో శుభ్రం చేయించారు. ఘాట్ల వద్ద బారికేట్లను ఏర్పాటు చేయించారు. పవిత్ర సంగమంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌ ఎ.సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రజాశక్తి-వన్‌టౌన్‌: మహాశివరాత్రి సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి యాత్రికులు అధిక సంఖ్యలో రానున్న నేపధ్యంలో శుక్రవారం ఆలయ పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ దుర్గా ఘాట్‌ను పరిశీలించారు. స్నాన సదుపాయాలు, శానిటేషన్‌ పరిశీలించి యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజినీర్‌ లింగం రమాదేవి పాల్గొన్నారు.