Jan 06,2023 23:06

కోడిపందేలకు పందెంరాయుళ్లు సిద్ధం
కఠిన చర్యలు తప్పవని జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికలు
ఇదంతా మామూలే అంటున్న పందెంరాయుళ్లు
గతేడాది ఉమ్మడి జిల్లాలో 400కు పైగా బరుల్లో పందేల జోరు
ఈ ఏడాదైనా కోర్టు ఆదేశాలను అమలు చేస్తారా?
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

               'కోడిపందేలు నిర్వహించాలంటే భయపడేలా చర్యలుండాలి. పందేలు నిర్వహించేవారితోపాటు పాల్గొనే వారిపైనా కఠిన చర్యలు తప్పవు. ఆర్‌డిఒ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేస్తాం' అంటూ ఇటీవల ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు. ఇవన్నీ తమకు మామూలే అంటూ పందెంరాయుళ్లు కొట్టిపారేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. ప్రతియేటా కోడి పందేలను అడ్డుకుంటామంటూ జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి నుంచి డివిజన్‌, మండల స్థాయి అధికారుల వరకూ ప్రకటనలు గుప్పించడం మినహా అడ్డుకట్ట వేసిన పరిస్థితి లేకపోవడమే. కోడిపందేలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం చేయడం, బరులు ధ్వంసం చేస్తున్నట్లు హడావుడి చేయడం మినహా పందేలకు పండుగ మూడు రోజులు అడ్డుకట్ట పడిన పరిస్థితి ఇప్పటి వరకూ లేదు. కోడిపందేలను నిరోధించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిన్పటికీ దాన్ని అమలు చేసిన దాఖలాల్లేవనే చెప్పాలి. గతేడాది పండుగ మూడు రోజులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400కుపైగా బరుల్లో యథేచ్ఛగా కోడిపందేలు సాగాయి. అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ ఇవి ప్రచురితం కావడంతోపాటు ప్రసారమయ్యాయి. పలుచోట్ల ఎంఎల్‌ఎలే కోడిపందేలను ప్రారంభించడం గమనార్హం. ఇదంతా బహిరంగంగానే సాగినా పండుగ మూడు రోజులూ ఏఒక్క అధికారీ అటువైపు చూసిన దాఖలాలు లేవు. కోడి పందేలను అడ్డుకున్నదీ లేదు.
జాతరను తలపిస్తున్న బరులు
పండుగ మూడు రోజులు కోడిపందేల వద్ద జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు అన్నీఇన్నీ కావు. గుండాట, మూడు ముక్కలాట, మద్యం అమ్మకాలు ఇలా అనేక చట్టవ్యతిరేక చర్యలు సాగుతున్నాయి. గతేడాది కోడిపందేల ముసుగులో దాదాపు జిల్లాలో రూ.200 కోట్లకుపైగా పందేల రూపంలో చేతులు మారినట్లు అంచనా. ప్రధాన రహదారుల పక్కనే పందేల జోరు సాగింది. బరుల ప్రాంతాలన్నీ జాతరను తలపించాయి. కిలోమీటర్ల మేర కారులు, మోటార్‌ సైకిళ్లు బారులు తీరాయి. రాత్రీ పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో కోడిపందేలు సాగాయి. అయినప్పటికీ మండల కమిటీలుగాని, డివిజన్‌, జిల్లా అధికారులుగాని అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవు. ప్రస్తుతం అధికారులు చేస్తున్న హెచ్చరికలు సైతం అదేకోవకు చెందినవే అన్నట్లు పందెంరాయుళ్లు మాట్లాడుతున్నారు. పందేలకు ఆకర్షితులై ప్రతియేటా అనేక మంది సామాన్య ప్రజానీకం తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. పొలాలకు పెట్టుబడి కోసం తెచ్చిన సొమ్ము, ఇంట్లో పండుగ ఖర్చుల కోసం దాచుకున్న డబ్బు, బంగారం తాకట్టు పెట్టి మరీ పందేల్లో పోగొట్టుకుంటున్నారు. పందేలను అడ్డుకోవాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఇస్తున్న అనధికార ఆదేశాలతో జిల్లాలో పండుగ మూడు రోజులు యథేచ్ఛగా కోడిపందేలు సాగిపోతున్నాయి. దీంతో ఈసారీ ప్రకటనలకే పరిమితమవుతారా..కోడి పందేలను అడ్డుకుంటారా అనే చర్చ జనాల్లో పెద్దఎత్తున సాగుతోంది.

పందేల ఏర్పాట్లకు రెఢ
కోడి పందేల ఏర్పాట్లకు సంబంధించిన నిర్వాహకులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లకు ఆహ్వానాలు వెళ్లిపోయాయి. పట్టణాల్లో హోటల్‌ రూములను ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. ఎక్కడ పందేలు నిర్వహించాలో స్థల ఎంపికలు కూడా జరిగిపోయాయి. మామూళ్లు ఎవరికి ఎంతివ్వాలో నిర్ణయాలు జరిగిపోయినట్లు చెబుతున్నారు. పందెం పుంజులకు పెద్దఎత్తున తర్ఫీదు ఇస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే పందేలకు ఎటువంటి ఆటంకమూ ఉండదని పందెంరాయుళ్లు ఎంత ధీమాగా ఉన్నారో వేరే చెప్పనక్కర్లేదు. అధికారులు ప్రకటనలకు, హెచ్చరికలకు పరిమితం కాకుండా చేతల్లో పందేలను అడ్డుకుని చూపించాలని జనం కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆ పండుగ మూడు రోజులు ఏం జరుగుతుందో మరికొద్ది వేచిచూడాల్సిందే.