Mar 02,2023 22:25

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: నిత్య జీవితంలో సైన్సు అంతర్భాగంగా ఉందని, సైన్సు ద్వారానే సమాజాభివృద్ది జరుగుతుందని సెర్ఫ్‌ సీఈవో ఎఎండి ఇంతియాజ్‌ అన్నారు. సేఫ్‌ (స్టెప్‌ ఎహెడ్‌ ఫర్‌ ఈక్వాలిటీ) ఆంధ్రా లయోలా కళాశాల ఆధ్వర్యంలో నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో నిర్వహించిన సైన్స్‌ ఎక్స్‌పో-2023ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయని వాటిని విద్యార్థులు తెలుసుకోవడంతో పాటు విజ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయాలన్నారు. విద్యార్ధి దశ నుండే సైన్సుపై అవగాహన పెంచుకుని ఉన్నత చదువులు చదువుకుని గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని అన్నారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ప్రాక్టికల్‌గా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రయోగాలు చక్కగా చేసి చూపించారని ఈ సందర్భంగా చిన్నారులకు అభినందనలు తెలిపారు. అలాగే ప్రతిఒక్కరూ సమజాంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కనెక్ట్‌ ఆంధ్ర సీఈవో కె.శివశంకర్‌ మాట్లాడుతూ పరిశీలన, పరిశోధన, ప్రశ్నించేతత్వాన్ని విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. ప్రకృతిలోని ప్రతి వస్తువు సైన్సుపైనే ఆధారపడి ఉందన్నారు. సైన్సు ఎంత అభివృద్ది చెందిన సమాజంలో కొన్ని మూఢనమ్మకాలు వస్తున్నాయని, వాటిని విద్యార్థులు నమ్మకుండా సైన్సు నేర్చుకుని గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. రానున్న కాలంలో భారతదేశం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో మంచి శక్తివంతంగా ఎదగనుందని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సేఫ్‌ అధ్యక్షురాలు జి.జ్యోత్న్స మాట్లాడుతూ మహిళలు, మహిళా సాధికారత గురించి, మహిళల సమస్యల గురించి సేఫ్‌ వివిధ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. అయితే సమాజంలో స్త్రీ, పురుషులు సమానమనే భావన రావాల్సిన అవసరం ఉందని అందుకు యువత నుండి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎనిమిది కళాశాలల సహకారంతో సేఫ్‌ సైన్సు ప్రదర్శను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 260కిపైగా ప్రదర్శనాంశాలు ఉన్నాయని, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ విజ్ఞానాన్ని తెలియజేసే విధంగా ప్రదర్శనాంశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ జి.ఎ.పి.కిషోర్‌, కరస్పాండెంట్‌ జేవియర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ వై.టి.ప్రభు, కళాశాల ఆంగ్లశాఖ ఉపాధ్యాయురాలు డాక్టర్‌ ఎల్‌.సుభ, సేఫ్‌ సెక్రటరీ జి.వాణి తదితరులు పాల్గొన్నారు.