ప్రజాశక్తి : విద్యార్థి దశ నుంచే పరిశోధనలను ప్రోత్సహించినట్లయితే సమాజాభివద్ధి సాధ్యమవుతుందని కడప పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు మార్తాల వెంకటకష్ణారెడ్డి అన్నారు. శనివారం రాయచోటి డైట్‌లో ఏపీ శాస్త్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సజనాత్మక ఆలోచనలకు పదును పెట్టడానికి సైన్స్ ప్రాజెక్టులతో కూడిన విజ్ఞానమేల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సైన్స్‌ను మానవాభివద్ధికి ఉపయోగప డేటట్లు చేయడం బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఉపాధ్యాయులంతా విద్యార్థులను అన్ని సైన్స్ కార్యక్రమంలో పాల్గొనేటట్లు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో అన్ని సైన్స్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్న సైన్స్ ఉపాధ్యాయులను అభినందించారు. 'ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు కోసం పర్యావరణాన్ని అర్థం చేసుకోవడం' అనే ఇతివత్తం ఆధారంగా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నామని చెప్పారు.విద్యార్థులు కనీస సామర్ధ్యాలు సాధించడానికి ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా కషి చేయాలని సూచించారు. శిక్షణ తర్వాత పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించడానికి మొదట బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలన్నారు. అనంతరం చదువులో వెనుకబడిన విద్యార్థులను గ్రూపులుగా విభజించి వారిలో విద్యా ప్రమాణాల పెంపుదలకు కషి చేయాలన్నారు. దానికోసం ప్రత్యేక బోధన పద్ధతులను ఉపాధ్యాయులు అనుసరించాలన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా వ్యాప్తంగా 112 మంది బాల శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ప్రాజెక్టులను సమర్పించగా, ఏడు ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. వాటిలో బురకాయల కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆఫ్రా, చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన శివ దీక్షిత, అదే పాఠశాలకు చెందిన లక్ష్మీ త్రివేణి, రాయచోటి ఆదర్శ పాఠశాలకు చెందిన జాహ్నవి, అదే పాఠశాలకు చెందిన నిషిత, పోలోపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన లేఖన సాహితీ, నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన చాణక్య ఉన్నారు. కార్యక్రమంలో ఆప్‌కాస్ట్ జిల్లా సమన్వయకర్త రవీంద్రారెడ్డి, అకడమిక్ కో-ఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి, స్కౌట్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, అసిస్టెంట్ ఎఎంఒ షమీవుల్లా, ట్రైనింగ్ ఇన్‌ఛార్జి రెడ్డయ్య, రాష్ట్ర అబ్జర్వర్ డేవిడ్, రిసోర్స్ పర్సన్స్ నరసింహులు, మధుమతి, ఎంఇఒలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.