Feb 28,2021 12:20

సుమారు 90 ఏళ్ల క్రితం 1930లో చంద్రశేఖర్‌ వెంకట్రామన్‌ (సర్‌ సివి రామన్‌) ఆవిష్కరణైనా 'రామన్‌ ఎఫెక్ట్‌'కు (ఒక కాంతి పుంజం అణువుల వల్ల మార్గం మళ్లితే, తరంగదైర్ఘ్యంలో మార్పు వస్తుందనేది రామన్‌ ప్రభావం) నోబెల్‌ వచ్చింది. ఆ సందర్భంగా మన దేశంలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి 28వ తేదీని ''జాతీయ సైన్స్‌ దినం''గా పాటిస్తున్నాం. రామన్‌కి 1954లో ''భారతరత్న'' పురస్కారం లభించింది. తొలి జాతీయ సైన్స్‌ దినోత్సవం 1987లో జరుపుకున్నాం. నిత్యజీవితంలో సైన్స్‌ ప్రాముఖ్యత గురించి పేర్కొనాలి. సైన్స్‌లో జరిగే కృషి, సాధించిన విషయాలను ప్రదర్శించాలి. కొత్త టెక్నాలజీలను చర్చించి, అమలు చేయాలి. శాస్త్రీయ దృక్పథానికి అవకాశాలు కల్పించాలి. శాస్త్ర-సాంకేతిక ప్రాచుర్యాన్ని ప్రోత్సహించాలి.
 

ఉత్సుకతే కారణం..
రామన్‌ ఒకసారి ఇంగ్లాండ్‌కు సముద్రం మీద ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రాల్లో రామన్‌ ఓడపైకి వెళ్లి నిలబడి ఆకాశాన్ని, సముద్రాన్ని పరిశీలించేవాడు. అతని పరిశీలనలో ఆకాశం నీలంగా, కింద సముద్రమూ అదే నీలం రంగులో ఉందని గమనించాడు. దీనికి కారణం ఏమిటన్న ఆలోచన నుంచే 'రామన్‌ ప్రభావం' ఆవిష్కృతమైంది. జేమ్స్‌వాట్‌ కథ కూడా అలాంటిదే. ఆయన టీ కాసే కెటిల్‌ నుంచి వచ్చే ఆవిరిని చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆవిరి వల్ల దానిపైన ఉన్న మూత పడిపోవడం గమనించాడు. అది ఎందుకు పడిపోతోంది? దాన్ని ఏది పైకి నెట్టేస్తుంది? అనే సందేహాలు అతనికి వచ్చాయి. ఆ ఆలోచనతోనే ఆవిరిశక్తి, ఆ తర్వాత ఆవిరి యంత్రం ఆవిర్భవించాయి. ఆ ఆవిష్కరణ ఏకంగా పారిశ్రామిక విప్లవానికే దారితీసింది. శాస్త్రీయ ఆలోచనకు అంతటి శక్తి ఉంది మరి.
 

సైన్స్‌తోనే పురోగతి

విజ్ఞానంతోనే వికాసం..
సైన్సు అనేది ప్రయోగాలకు నిలిచేది. దాన్ని నిరూపించగలం. అంతే తప్ప ఎలాంటి మంత్రాలు, మహత్యాలు ఉండవు. అది ఒకసారి రుజువు చేశాకే నిర్ధారణ అవుతుంది. సైన్సు అందరికీ వర్తిస్తుంది. ఏ కొందరికే పరిమితమైంది కాదు. మన నిత్య జీవితంలో అనేకమైనవి మనకు తెలిసినా, తెలియకపోయినా సైన్స్‌ ఆధారంగా జరుగుతాయి. మనం గాలి పీల్చడం, ఆహారం తీసుకోవడం, తిన్న ఆహారం జీర్ణం కావడం. ఇవన్నీ ఎంతటివారికైనా ఒకరకమైన జీవనసూత్రమే. మాయలు, మంత్రాలు అంటూ గారడీ చేసేవాళ్లు ఉపయోగించేది సైన్సే.
పిల్లలకు బాల్యం నుండే శాస్త్రీయ ఆలోచనల్లో భాగస్వాముల్ని చేయాలి. ప్రతి క్రియ వెనుకా ఓ కార్యాకారణ సంబంధం ఉంటుందన్నది అవగతం చేయాలి. అప్పుడు వాళ్లకు ఆచరణకు, ఆలోచనకు సమన్వయం ఏర్పడుతుంది. శ్వాస తీసుకోవడం ఎంత నిత్యకృత్యమో సైన్స్‌ మనలో ఒక భాగమవుతుంది. కానీ సరిగ్గా ఇక్కడే చాలా సందర్భాల్లో ఆచరణకు, ఆలోచనకు సమన్వయం తప్పుతుంది. సైన్సు సంబంధ కార్యానికి సంబంధంలేని మరొక అతీత భావాన్ని పెనవేసే ప్రయత్నం జరుగుతుంది.

  • వర్షం ఆకాశం నుండి ఎలా కురుస్తుంది? పక్షులు ఎలా ఎగురుతున్నాయి? రక్తం ఎర్రగానే ఎందుకుంది? ఆకులు ఆకుపచ్చగా ఎందుకున్నాయి? పూలు బోలెడు రంగుల్లో ఎలా ఉన్నాయి? జ్వరం ఎందుకు వస్తుంది? వర్షం వచ్చినప్పుడు మేఘాలు ఎందుకు ఉరుముతాయి? ఇలా అనేక ప్రశ్నలకు సైన్సులో సమాధానాలు ఉన్నాయి. కానీ ప్రాచుర్యంలో పురాణాలను జోడించి చెప్తుంటారు. అవన్నీ కథలూ, కల్పితాలు. పిల్లలకు ఇవి కాదు చెప్పాల్సింది. సైన్సుపరమైన సమాధానాలే చెప్పాలి. అప్పుడే వారిలో విజ్ఞాన వికాసానికి తోడ్పడతాయి.
  • సైన్సు ఒక శక్తి. అంతకు మించిన మరోశక్తి ఏమీ లేదు. సైన్స్‌ ఫలితాలు సామాన్యులకు సైతం సులువుగానే తెలుస్తాయి. ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. కానీ అందుకు భిన్నంగా శాస్త్రీయ భావాల్ని, మూఢనమ్మకాల్ని జోడించి చెప్పడం విజ్ఞానం వికటించేలా చేస్తుంది. సైన్సు అనేది ప్రయోగానికి నిలబడాలి. కల్లబొల్లి కబుర్లతో చెప్పే విషయాలు కాదు. మోడీ రాజ్యంలో వీళ్లకి అడ్డూఅదుపూ లేదు. శాస్త్ర పరిశోధన విజయాలనూ దేవుని దయతోనే అన్న అభిప్రాయం కలిగించడం. యుద్ధ విమానాలకు సాక్షాత్తు కేంద్రమంత్రే కొబ్బరికాయలు కొట్టడం. ఇవన్నీ దేశ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చడమే. పిల్లల్లో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించాలి. నేడు మన దేశంలో ప్రశ్నిస్తే ప్రోత్సహించడమేమోగానీ 'దేశద్రోహి' అని ముద్ర వేస్తున్నారు. బాల్యం నుండే శాస్త్రీయ ఆలోచనను, అన్వేషణతత్వాన్ని పెంపొందించాలి. అలాంటి విజ్ఞానం కలిగించే పాఠాలు, పాఠ్యపుస్తకాలు అవసరం. సైన్సు ప్రయోగాలు, సైన్స్‌ కథలు పిల్లల్లో ఉత్సుకతను పెంచుతాయి. 

                                                     * ఆర్యన్‌ (నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం)