ప్రజాశక్తి-అనకాపల్లి
మూఢనమ్మకాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు జన విజ్ఞాన వేదిక ఎంతో కషి చేస్తుందని, సైన్స్ ద్వారా మూఢనమ్మకాలకు చెక్ పెట్టవచ్చని జెవివి నాయకులు త్రిమూర్తులురెడ్డి, బొప్పే ఉమామహేశ్వర రావు, బి.నూకేష్, గంట శ్రీరామ్ అన్నారు. స్థానిక జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏపీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్టు-2022 నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన ఫలితాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పాఠశాల హెచ్‌ఎం రుధిర రాణి మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించేందుకు చెకుముకి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో 80 మంది పాల్గొన్నారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ పరీక్షలో నాలుగు బృందాలను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. జిల్లాస్థాయి పరీక్షలు డిసెంబర్ 10, 11 తేదీల్లో జరుగుతాయని జెవిసి నాయకులు తెలిపారు.
విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి
అచ్యుతాపురం : విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డేడ రామ్‌కుమార్ పిలుపునిచ్చారు. జెవివి మండల కమిటీ ఆధ్వర్యంలో అచ్చుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మనిషి జీవితమంతా సైన్స్‌తో ముడిపడి ఉందన్నారు. నిత్యజీవితంలో సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని వ్యక్తిగతంగా, సామాజిక పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పారు. జెవివి జిల్లా ఉపాధ్యక్షుడు మారిశెట్టి వెంకట అప్పారావు మాట్లాడుతూ సైన్స్ పట్ల అవగాహన పెంచేలా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చెకుముకి పోటీలలో 66 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. జెడ్‌పి హైస్కూల్ హెచ్‌ఎం కెఎస్.శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.










