Feb 20,2023 22:09

కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి - ఏలూరు

             సైన్స్‌ ఫెయిర్‌ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న వ్యక్తిగత నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ ప్రదర్శనలు దోహద పడతాయని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. సోమవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కస్తూరిబా నగర బాలికల ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించే జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక, సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడేలా వినూత్న ఆలోచనలతో వారిని మరింత ముందుకెళ్లేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థి దశ నుంచే వైజ్ఞానికంపై మక్కువ కలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచే చదవుతోపాటు వైజ్ఞానికంపై విద్యార్ధులకు అవగాహన కల్పించి ఉత్తమ శాస్త్రవేత్తలుగా తయారు చేయడానికి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2023 సంవత్సరానికిగాను జిల్లాలో నవంబరులో పాఠశాల స్థాయి నుంచి మండలస్థాయి వరకు నిర్వహించిన సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో మొదటి, రెండు స్ధానాలను సాధించిన వారిని జిల్లాస్ధాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో పర్యావరణహిత పదార్థాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, సాఫ్ట్‌వేర్‌, యాప్‌ల తయారీ, పర్యావరణ వాతావరణ మార్పులు, తడిచి మొలకలు వచ్చిన ధాన్యం, రక్షణ, గణిత నమూనాలు అనే ఐదు అంశాల్లో 28 మండలాల నుండి ఎంపికైన 120 ఎగ్జిబిట్స్‌ జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించామని చెప్పారు. జిల్లాస్థాయిలో మొదటి, రెండు స్థానాలు గెలుపొందిన వారిని ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనకు పంపుతారని తెలిపారు. అనంతరం ప్రదర్శనలో ప్రదర్శించిన వైజ్ఞానిక విషయాలను విద్యార్థులను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఎన్‌వి.రవిసాగర్‌, జెడ్‌పి సిఇఒ రవికుమార్‌, డిపిఒ మల్లికార్జునరావు, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డ్వామా పీడీ రాంబాబు, ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎస్‌.వెంకటకృష్ణ, ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచలకిషోర్‌, ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగేశ్వరరావు, స్కూలు ప్రధానోపాధ్యాయిని జి.సునీత, జిల్లాలోని డివైఇఒలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.