ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఆరోగ్యం పరిశుభ్రత విభాగంలో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని కె పూజితశ్రీ రూపొందించిన సేఫ్ క్లోత్ అనే ప్రదర్శనకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 27,28 తేదీల్లో విజయవాడ లయోలా కళాశాల ఆవరణలో నిర్వహించిన విద్య, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. 26 జిల్లాల నుంచి 260 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా ఆరోగ్యం, పరిశుభ్రత విభాగంలో ప్రథమ బహుమతి సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. బహుమతి ప్రదానోత్సవంంలో విజయవాడ మేయర్ రజనీ భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ నూపర్ అజరు, ఎన్‌సిఈఆర్‌టీ డైరెక్టర్ బి ప్రతాప్‌రెడ్డి, కాకినాడ ఆర్‌జెడి నాగమణి, ఎన్టీఆర్ జిల్లా డీఈఒ రేణుక, కృష్ణా జిల్లా డిఇఒ తాహెరా సుల్తానా సమక్షంలో ఈ బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూజితశ్రీ, గైడు ఉపాధ్యాయులు పోతురాజును డీఈఒ రామారావు ప్రత్యేకంగా అభినందించారు. పర్చూరు ఉప విద్యాశాఖ అధికారి అత్తోట కిరణ్ కుమార్, బాపట్ల జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్ పూజితశ్రీని అభినందించారు.
చీరాల: సమాజానికి ఉపయోగపడే విధంగా సాంకేతికత ఉండాలని, అప్పుడే దానికి సార్ధకత అని చీరాల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పోస్టర్ ప్రజెంటేషన్, పేపర్ ప్రజెంటేషన్, ప్రాజెక్టు ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజానికి అవసరమైన నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని చూపాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఒడిలు డాక్టర్ షేక్ బషీర, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, విద్యార్థులు, ఆచార్యులు, సహాయ ఆచార్యులు పాల్గొన్నారు.










