Dec 07,2022 21:54

ప్రజాశక్తి - ఏలూరు
           దేశ రక్షణ కోసం అహర్నిశలు విశిష్టసేవలందిస్తున్న సాయుధ దళాల త్యాగనిరతిని ప్రతిఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని సాయుధ దళాల పతాక దినోత్సవంలో భాగంగా జిల్లా సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పతాక నిధికి విరాళాల సేకరణను కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం నిధికి విరాళం అందించారు. పతాక నిధి ఫ్లాగ్‌ను ఎన్‌సిసి విద్యార్థులు కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భారత సైనిక దళాలు దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు, జాతియావత్తు గర్విస్తుందన్నారు. ప్రతిపౌరుడు సంఘీభావంగా పాల్గొని త్రిసాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం అందించాలని కోరారు. జిల్లాలోని విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజల సహకారంతో గత ఏడాది అధిక నిధులు సేకరించి అగ్రస్ధానంలో జిల్లా నిలిచిందన్నారు. అదే స్పూర్తి కొనసాగించి పతాక దినోత్సవ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా దేశసేవలో అమరులైన వారికి, గాయపడిన సైనికులకు, వారి కుటుంబాలకు మనమంతా కృతజ్ఞత చాటుదామన్నారు. మనం అందించే విరాళాలను డైరెక్టర్‌, సైనిక వెల్ఫేర్‌, విజయవాడ పేరున, స్టేట్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా ఖాతా - 33881128795, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌ 0016857కు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి జమచేసిన వివరాలను ఏలూరు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వాట్సప్‌ నెంబర్‌ 9177094013కు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి ప్రసాదరావు, సిబ్బంది నవాబ్‌జాన్‌, శ్రీనివాసులరెడ్డి, బడేటి శ్రీనివాస్‌, సుధాకర్‌, ఎక్స్‌ సార్జెంట్‌, శ్రీధర్‌, సర్‌సిఆర్‌ రెడ్డి కళాశాల ఎన్‌సిసి విద్యార్థులు పాల్గొన్నారు.