Sep 07,2023 21:35

మాట్లాడుతున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి..
- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ప్యాపిలో జిల్లా నేతలు ఘనంగా స్వాగతం
ప్రజాశక్తి - ప్యాపిలి

    రాష్ట్రంలో సైకో పోవాలి, సైకిల్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా నుంచి నంద్యాల జిల్లాలోని బనగానపల్లెకు వెళ్తున్న సందర్బంగా ప్యాపిలిలో చంద్రబాబు నాయుడుకు జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌ రెడ్డి, డోన్‌ నియోజకవర్గ ఇన్చార్జి ధర్మారం సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి నాగేశ్వరరావు యాదవ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. ప్యాపిలి ఆర్‌టిసి బస్టాండ్‌ ఆవరణలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజల్లో వైసిపి ప్రభుత్వంఫై తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్‌ ఓటమి ఖాయమైందని, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రమే కాదు, ఎపిలో చాలామంది ప్రజలు ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. పలువురు ఎన్నారైలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో గతంలో పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు కూడా అధికార వైసిపికి గట్టి బుద్ది చెప్పారని, దాంతో నిన్న మొన్నటి వరకు వై నాట్‌ 175 అంటూ అడిగిన జగన్‌కు కోలుకోలేని షాక్‌ అనే చెప్పవచ్చన్నారు. పట్టభధ్రులు ఇంతగా బుద్ది చెప్పినప్పటికీ అధికార వైసిపి మాత్రం బయటకు చెబుతున్నది ఈ మాత్రం దానికే సంబరాలా అని; కానీ లోలోపల మాత్రం వైసిపి నాయకులు, అధినేత కూడా ఘోర పరాజయంగా భావిస్తున్నారని చెప్పారు. వైసిపిని కూకటి వేళ్ళతో పెకిలించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వలసల రామకృష్ణ, రాఘవేంద్ర, అంకిరెడ్డి, రామసుబ్బయ్య, రాంమోహన్‌, చిన్న సుంకయ్య, సుదర్శన్‌, పెద్ద రామాంజనేయులు, నాగేంద్ర, మధు, చల్లావీర, ఖాజా పీర్‌, అభి, దీపు, మధు, ఎస్‌కె వలి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.