ప్రజాశక్తి-హిందూపురం : సైకో పాలనలో వైసిపి గుండాలు రెచ్చిపోతున్నారని వీరి పాలనలో సామాన్యుడికి రక్షణ కరువైందనిటిడిపి అద్యక్షులు బికె పార్థ సారథి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. శుక్రవారం పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వెంకటరమణపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలపై భూమి తగాదా విషయంలో స్థానిక వైసీపీ నాయకుడు చౌడిరెడ్డి, ఇతర ప్రాంతాల నుండి 10 మందిని తీసుకువచ్చి వేట కొడవళ్ళతోను, బీరు బాటిళ్ల తో దాడి చేయగా తీవ్రంగా గాయపడిన వారిని హిందూపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు, బెంగళూరు తీసుకువెళ్లారు. హిందూపురం ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పార్థ సారథి, సవితమ్మ, అంబికా లక్ష్మినారాయణలు పమామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కూలి పనులు చేసుకునే పేద కుటుంబాలపై వైసిపికి చెందిన మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ చెవిరెడ్డి రౌడీలను తీసుకుని వచ్చి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సాధికారిక కన్వినర్ వడ్డే వెంకట్, పరిగి కన్వీనర్ టి.లక్ష్మిరెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డి.శివశంకర్, జిల్లా బిసి సెల్ అధికార ప్రతినిధి శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమార్, వడ్డేర సాధికార రాష్ట్ర కమిటీ సభ్యుడు హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా టిడిపి నాయకులు కురుబ కష్ణమూర్తి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.










