ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్రంలో సైకో పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు పి.అశోక్ గజపతిరాజు అన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు బొబ్బిలిలో బేబినాయన ప్రారంభించిన అన్న క్యాంటీన్ కు 500 రోజులు పూర్తి కావడంతో కోటలో మంగళవారం సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో పాలనలో రాజ్యాంగ హక్కులపై దాడి జరుగుతుందన్నారు. సైకో పాలనలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు గతంలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌టిఆర్ అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం మూసివేయడం పేదల కడుపు కొట్టడమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టిడిపి పెద్దపీట వేసి అన్న క్యాంటీన్లు పెట్టి పేదలకు అన్నం పెడితే వైసిపి ప్రభుత్వం మూసివేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల ఆకలి తీరుస్తున్న బేబినాయనకు కతజ్ఞతలు చెప్పారు. టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత వరకు అన్న క్యాంటీన్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.