Aug 17,2022 00:26

కేసు వివరాలు వెల్లడిస్తున్న సిపి

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : ఈ నెల 6న చినముషిడివాడ జంట హత్యలు, 14న పెందుర్తి నాగమల్లి లే అవుట్‌లో జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితుడు సందక రాంబాబు(49)ను అరెస్ట్‌ చేశామని నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. నిందితుడు వారం రోజుల్లో మూడు హత్యలు చేశాడని తెలిపారు. అతడిని అనకాపల్లి జిల్లా కోటవురట్ల వాసిగా గుర్తించినట్లు చెప్పారు. 2018లో తన భార్య ఇంటి యజమానితో వివాహేతర సంబంధం వల్ల తీవ్ర ఒత్తిడికిలోనై ఆమెతో విడాకులు తీసుకున్నాడని. అప్పటి నుంచి మహిళలపై కక్ష పెంచుకుని సైకోగా మారి హత్యలు చేస్తున్నాడని తెలిపారు. వారం రోజుల క్రితం వాచ్‌మ్యాన్‌ దంపతులను హత్య చేశాడని, తాను చంపిన వాళ్లలో మహిళ ఉన్నారా ? లేదా ? అని నిర్ధారించుకోవడం, అనంతరం మృతి చెందిన మహిళల మృత దేహాలను విచక్షణ రహితంగా తన్నడం.. అతని అలవాటని తెలిపారు. వారం తరువాత మరో మహిళను హత్య చేశాడని, అంతేకాకుండా మరొకరిపై హత్యాయత్నం కూడా చేశాడని ఆయన తెలిపారు . కొద్ది నెలల నుంచి రాంబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, పెందుర్తి హత్య కేసులో మృతుల తలపై రాడ్డుతో మోది చంపాడని తెలిపారు. వాచ్‌మెన్‌లు అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుందని వాళ్లను ఎంచుకునేవాడని. తను అద్దెకు ఉన్న ఇళ్ళలో క్షుద్ర పూజలు చేసేవాడని తెలిపాడు. దేవుడు వస్తున్నాడంటూ పిచ్చి పిచ్చిగా కేకలు వేసేవాడని అన్నారు. నిందితునికి కూతురు, కుమారుడు ఉన్నారని, వారు అతన్ని దగ్గరకు రానివ్వకపోవటంతో గతంలో హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్‌గానూ, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలోనూ పని చేశాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయా ? అన్నదానిపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసు చేధించడంలో ప్రతిభ కనబరిచిన సిటీ టాస్క్‌ ఫోర్సు, క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులను సిపి అభినందించారు.