Feb 14,2023 21:49

ప్రజాశక్తి - ఏలూరు
           సైక్లింగ్‌తో అద్బుత ప్రయోజనాలు ఉన్నాయని డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎవిఆర్‌.మోహన్‌ అన్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ వారి సూచనలతో మంగళవారం స్ధానిక ఇండోర్‌ స్టేడియం వద్ద నిర్వహించిన సైకిల్‌ ఫర్‌ హెల్త్‌ కార్యక్రమాన్ని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగేశ్వరరావుతో కలిసి డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఎవిఆర్‌.మోహన్‌ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌ మాట్లాడుతూ సైక్లింగ్‌ చేయడం వల్ల కండరాలు భయపడటంతోపాటు శరీర బరువు తగ్గేందుకు సహకరిస్తుందన్నారు. గుండె ఆరోగ్యానికి మంచిదని అదే విధంగా అధిక రక్తపోటు తగ్గిస్తుందన్నారు. ఒత్తిడి, మానసిక వేదనలను నియంత్రించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నారు. అన్ని వయస్సుల వారికి అనుకూల ప్రభావం చూపే వ్యాయామం సైక్లింగ్‌ అని అన్నారు. క్రమం తప్పకుండా సైక్లింగ్‌ చేయడం వల్ల మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, వివిధ జీవనశైలి రుగ్మతలు అనేక ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగేశ్వరరావు, అదనపు డిఎంహెచ్‌ఒ రత్నకుమారి, సెట్‌వెల్‌ సిఇఒ ఎమ్‌డి.మెహరాజ్‌, క్రీడాశాఖాధికారి శ్రీనివాసరావు పలు విద్యాసంస్థల విద్యార్థులు, వైద్య సిబ్బంది, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.